అవినీతి ఆరోపణలు వచ్చినందుకే పదవి నుంచి దించింది : పొన్నం

అవినీతి ఆరోపణలు వచ్చినందుకే  పదవి నుంచి దించింది : పొన్నం

ప్రధాని మోదీ దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నాని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ పాలనలో అదాని, అంబానికి తప్ప..  సామాన్యుడికి‌ న్యాయం జరగలేదన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‌మొదటి దశ లోక్ సభ ఎన్నికలు కాగానే మోదీకి భయం పట్టుకుందన్నారు.  పదేండ్లలలో బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు.

బండిసంజయ్  పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారన్నారు పొన్నం. తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండిసంజయ్ అని దుయ్యబట్టారు. బండిసంజయ్ నిజమైన భక్తుడు అయితే  గుడులకి ఏమి చేశాడో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రూ.6కోట్ల తో ఓట్లని కొనాలని చూశాడని.. హోటల్ లో దొరికిన డబ్బులు వాళ్లవేనని అన్నారు.

రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకువచ్చింది బీజేపీ అని మంత్రి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ కేవలం మాటలకే పరిమితం అయ్యిందన్నారు.  మీ అభ్యర్థి నియంత మోదీ అయితే... మా అభ్యర్థి‌ మానవతవాది రాహుల్ గాంధీ అన్నారాయన. ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫి చేస్తామని ఆయన చెప్పారు. ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి.. ప్రభుత్వం కూలగొడతామన్నోళ్లకు బుద్ది చెప్పాలని మంత్రి పొన్నం అన్నారు.