రాహుల్ గాంధీపై కుట్ర చేసి రెండేళ్లు జైలు శిక్ష పడే విధంగా బీజేపీ చేసిందంటూ మార్చి 24, శుక్రవారం కరీంనగర్ కోతి రాంపూర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దీక్ష చేపట్టారు. చట్టసభలకు అర్హత లేకుండా రాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాహుల్ కు శిక్ష వేసిన నిన్నటి రోజు ఓ చీకటి రోజు అన్నారు పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో ఎన్నికల ప్రచారంలో అన్న మాటను తప్పుపడుతూ ఇన్నేళ్ల తర్వాత శిక్షవేసి చట్టసభకు అర్హత లేని విధంగా చూడాలనే కుట్ర కనిపిస్తోందన్నారు.
బీజేపీ పన్నిన కుట్రను దేశ ప్రజలు గుర్తించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. అందుకే తాను మహాత్మా గాంధీ సాక్షిగా ఈ మౌన దీక్ష చేపడుతున్నాను వెల్లడించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం బ్రతికి ఉంటేనే ఈ దేశం ముందుకు నడవగలుగుతుందని చెప్పిన వ్యక్తి రాహుల్ అని తెలిపారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపార వేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఈ వాస్తవాలను ధైర్యంగా చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ గురించి వాస్తవాలను తెలియజేసిన బిబిసి లాంటి ఛానల్ ను నిషేధించే పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. రాహుల్ కామెంట్లపై మోడీ అనే పేరున్న ఓ న్యాయవాది కేసు వేయడం వెనుక రాజకీయపరంగా కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు పొన్నం ప్రభాకర్.