మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ శనివారం జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల కేంద్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలు, కార్నర్ మీటింగుల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే, లిక్కర్ స్కామ్ లో బిడ్డ జైలుకు పోతే... ప్రభుత్వాన్ని కూలగొడతానని మాజీ ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని పండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్, సంక్షేమ పథకాల అమలు చేస్తుంటే.. జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీనా మమ్మల్ని ప్రశ్నించేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నాశనం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏం దిద్దుదామని తిరుగుతున్నావ్ అంటూ కేసీఆర్ పై నిప్పులు చేరిగారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది... మీ లాగా నియంతృత్వ ప్రభుత్వం కాదన్నారు.
గతంలో పిట్టలదొర ఉండే.. అలాంటి వేషం వెయ్యకు అని ఎద్దేవా చేశారు పొన్నం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ మమ్మల్ని ప్రశ్నించేది ఏందని ధ్వజమెత్తారు. మతం పేరుతో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీపై మంత్రి పొన్నం నిప్పులు చెరిగారు.