కరీంనగర్ : రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మునుగోడు లాంటి ఉప ఎన్నికలు మరో 10, 12 వస్తాయన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలు తెస్తారా అని ప్రశ్నించారు. శంకరపట్నంలో పాదయాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. బీజేపీ తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు అమలు చేయకుండా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకే కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదని అన్నారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్లో మాత్రం ప్రచారం చేసి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారని చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి కాంగ్రెస్ను లేకుండా చేయాలని చూస్తున్నాయని పొన్నం ఆరోపించారు. హుజూరాబాద్ లో గెలిచింది బీజేపీ కాదు.. ఈటల రాజేందర్ మాత్రమేనని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్న పొన్నం ప్రభాకర్.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తోందని విమర్శించారు. పాలకుల మనసు ఇప్పటికైనా మారాలని ఆకాంక్షించారు.