ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు : గ్రామాల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు రానివ్వబోనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చెప్పారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సత్యసాయి గార్డెన్, భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన పాల్గొని గ్రామాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా దేవాదుల, గౌరెల్లి ప్రాజెక్టుల ద్వారా రెండు మండలాల్లో తాగు, సాగు నీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
హుస్నాబాద్నియోజకవర్గానికి ఎల్కతుర్తి ముఖద్వారమని, మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కాంప్లెక్స్, చౌరస్తాలో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. త్వరలో గ్రామాల వారీగా పర్యటించి, విద్య, వైద్యం, నీటి పారుదల రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని మంత్రి ఆఫీసర్లను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో గ్రామాల్లో ముందస్తు జాగ్రతలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, ఐలయ్య, సుకినె సంతాజీ, సీనియర్లీడర్లు గొడిశాల యాదగిరి గౌడ్, గోలి రాజేశ్వరరావు, గొర్రె మహేందర్, శ్రీలం అనిల్ కుమార్, గొడిశాల రాజన్న గౌడ్, బొల్లెపోగు రమేశ్, అంబాల శ్రీకాంత్, హింగె శ్రీకాంత్ పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా..
సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో పర్యటించి, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు టెన్త్‌లో చిగురుమామిడి మండల టాపర్‌గా నిలిచిన దాసరి సిరి వైష్ణవ్యను అభినందించారు. కార్యక్రమంలో చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్, మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, కంది తిరుపతిరెడ్డి, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.