పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై పొన్నం ప్రభాకర్ క్లారిటీ

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని చెప్పారు. ఇదే అంశంపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను..NSUIలో సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి NSUI అధ్యక్షుడిగా పని చేశానని చెప్పారు. 

యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా పార్టీ కోసం 35 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు. మార్క్ ఫెడ్ చైర్మన్ గా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా పని చేశానని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, ఆంధ్ర పాలకులతో ఎన్నో అవమానాలకు గురయ్యానని, చివరకు పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురై.. చావు అంచుల వరకూ వెళ్లానని ప్రెస్ నోట్ లో వివరించారు పొన్నం ప్రభాకర్.

ALSO READ :అధ్యక్షుల మార్పుపై బీజేపీ ఆఫీసులో కార్యకర్తల ధర్నా

పార్టీలోనే కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యవహరిస్తూ.. ఏ కమిటీలోనూ తనకు చోటు కల్పించకుండా చేశారని ఆరోపించారు. తాను పార్టీ మారుతున్నానని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పదవులు లేకున్నా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉంటూనే.. తెలంగాణతో పాటు, కేంద్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జులై 30వ తేదీన కొల్లాపూర్ లో జరిగే ప్రియాంకగాంధీ సభలో ముఖ్య కార్యకర్తగా వెళ్లి పాల్గొంటానని చెప్పారు.