భీమదేవరపల్లి, వెలుగు : మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం పీవీ 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. పీవీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సలహాతో పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్ పై మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని తెలిపారు. మెదక్ నుంచి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పీవీ పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి నేతృత్వంలో రూ.40 వేల కోట్లతో గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పీవీకే దక్కుతుందని చెప్పారు.
+6.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.11 కోట్లతో చేపట్టిన పీవీ స్మృతివనానికి సంబంధించి మిగిలిన పనులపై నివేదిక అందించాలని కోరారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టపరచడానికి 45 నవోదయ, గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత పీవీకే దక్కుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.