మంచి మనసు చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే మంత్రి పొన్నం ప్రభాకర్.. తాజాగా తనలోని జాలి గుణాన్ని ప్రదర్శించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి ఆయన మంచి మనసు చాటుకున్నారు. ఆదివారం (నవంబర్ 10) ఉదయం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రపుర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్‎ను ఆటో వెనక నుండి ఢీకొట్టడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదం జరిగిన విషయం తెలుకుని వెంటనే ఘటన స్థలంలో ఆగారు. 

క్షతగాత్రులను పరిశీలించి దగ్గరుండి మరీ వారిని అంబులెన్స్‎లో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులతో పోలీస్  సిబ్బందిని హాస్పిటల్‎కి పంపించారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల‎తో ఫోన్‎లో సూచించారు. గాయపడ్డ బాధితులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఉరుకులు పరుగులతో ఎప్పుడు బిజీగా ఉండే మంత్రి.. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో మంత్రి పొన్నంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.