
- మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
- గత ప్రభుత్వ బకాయిలను చెల్లిస్తున్నాం
- రేపటి సీఎం సభను సక్సెస్ చేయాలని మంత్రి పిలుపు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎంపీగా ఆరేండ్లలో బండి సంజయ్ తెలంగాణకు ఏం తెచ్చావో చెప్పి గ్రాడ్యుయేట్లను ఓట్లు అడగాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు పాస్ పోర్ట్ ఆఫీస్, తిరుపతి రైలు, మోడల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో శనివారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
వేములవాడలో ఆలయ అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రానికి సీఎం నిధులు కేటాయించారని పేర్కొన్నారు. శాతవాహన వర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైందని, లా, ఇంజినీరింగ్ కాలేజీలు త్వరలో రాబోతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం సిరిసిల్లలో పెండింగ్ లో పెట్టిన బకాయిలు చెల్లించామని, మహిళా సంఘాలకు చీరల ఆర్డర్ ఇచ్చామని గుర్తు చేశారు.
ఈనెల 24న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నట్టు గ్రాడ్యుయేట్లు భారీగా తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.