మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఎన్నికల కోసం తాపత్రయపడుతూ బీజేపీ అసత్య ప్రచారాలకు దిగిందని, ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అలాగే డబుల్ బెడ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం వేములవాడ నంది కామన్ మారుపాక వద్దకు చేరుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... బండి సంజయ్ ఇప్పటివరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. మనిషి బతికుండగానే జీవచ్ఛవంలా మారుస్తూ వికృత చేష్టలకు పాల్పుడుతున్న పార్టీ బీజేపీనని, మతతత్వాన్ని రెచ్చగొడుతూ కేవలం రాజకీయ పబ్బం మాత్రమే గడుపుకొంటోందని విమర్శించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు తామే స్వాతంత్రం తెచ్చామన్నట్లుగా బీజేపీ అసత్య ప్రచారాలను రుద్దుతోందని ఆరోపించారు. స్వాతంత్రం తెచ్చిన తొలి రోజుల్లో చేసిన అనేక రంగాల అభివృద్ధి నేటి దేశానికి సురక్షితమైన, ఆర్థిక సుస్థిరతను సాధించిందని చెప్పుకొచ్చారు. దేశ స్వాతంత్ర ఉద్యమం నాటి నుండి ప్రజాసంక్షేమ వరకు దేశంలో కాంగ్రెస్ ప్రజలకు అండగా నిలిచిందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఇప్పటివరకు మళ్ళీ అభివృద్ధి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆస్తులన్నీ కార్పొరేట్ రంగాలకు తాకట్టు పెడుతూ నిర్వీర్యం చేస్తోందని.. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు అప్పగించారని తెలిపారు.