హుస్నాబాద్ ఎమ్మెల్యేపై పొన్నం చార్జిషీట్

హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చార్జిషీట్ విడుదల చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా ఉన్నా... ఎమ్మెల్యే సతీష్ కుమార్ వ్యతిరేకంగా ఉండడం వల్లే ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. సెంటిమెంట్ కు హుస్నాబాద్ ప్రజల కన్నీళ్లు, గజ్వేల్, సిద్దిపేటకు మాత్రం నీళ్లు అందించారని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.

పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒక్క విద్యాసంస్థను కూడా హుస్నాబాద్ లో ఏర్పాటు చేయలేదన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఐటీడీఏను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అసమర్థుడు అని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో సాక్షాలతో సహా మళ్లీ వివరిస్తామన్నారు. 

హుస్నాబాద్ ఎమ్మెల్యేను తాను వ్యక్తిగతంగా విమర్శించడం లేదన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అంటున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు లేదన్నారు. సమర్ధత, అసమర్ధతకు, బానిసత్వానికి, ఆశీర్వాదానికి హుస్నాబాద్ లో పోటీ జరుగుతోందన్నారు. పదేళ్లైనా ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన ఓటు హక్కును హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్ గ్రామంలో ఎందుకు ఉంచుకున్నారని, హుస్నాబాద్ కు ఎందుకు మార్చుకోలేదని ప్రశ్నించారు. 

Also Read :- రాత్రులు త్వరగా మూతపడుతున్న రెస్టారెంట్లు, షాపులు