పీవీ స్మారక మ్యూజియం పనులను పూర్తి చేయాలి

  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, వెలుగు : పీవీ స్మృతి వనం పనుల్లో స్పష్టత లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పీవీజ జయంతి సందర్భంగా బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ పీవీ నరసింహారావు నాటి రాజకీయాలతో పోలిస్తే నేటి రాజకీయాలు మారిన సిలబస్ గా మారాయన్నారు. వంగరలో అర్ధంతరంగా నిలిచిన పీవీ స్మారక మ్యూజియం ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పీవీ శతజయంతి సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. అలాగే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, పీవీ కుటుంబ సభ్యులు మదన్ మోహన్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ రాజు పీవీ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. 

తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే...

హుస్నాబాద్, వెలుగు : మరో ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టెను సీఎం కేసీఆర్ డబ్బుల కోసమే కాళేశ్వరంగా రీ డిజైన్ చేశారని ఆరోపించారు. తాగు, సాగునీటి కోసం అలమటిస్తున్న హుస్నాబాద్ ప్రాంతంపై కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లీడర్లు తమ సొంత ప్రయోజనాల కోసం హుస్నాబాద్ ను సిద్దిపేటలో కలిపారని విమర్శించారు. 

తాను ఎంపీగా ఉన్నప్పుడే హుస్నాబాద్ లో మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ, ఆర్డీవో ఆఫీసు ఏర్పాటుచేసినట్టు గుర్తు చేశారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు హుస్నాబాద్​కు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్​చేసిన అభివృద్ధి పనులే తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు లింగమూర్తి, సొసైటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్షులు బంక చందు, ఐలయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పాల్గొన్నారు.