- బండి సంజయ్ ఎందుకు స్పందిస్తలే?: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో వందల కోట్ల అక్రమాలు జరిగాయని, అయినా ఎంపీ బండి సంజయ్ నోరు విప్పడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. సర్కస్ గ్రౌండ్లో పార్క్పేరు తో రూ.130 కోట్లు, గీతా భవన్ చౌక్ బ్యూటిఫికేషన్ పేరుతో రూ.1.40 కోట్లు ఖర్చు చేశారని, మొత్తం రూ.640 కోట్లతో చేపట్టిన పనుల్లో అన్నీ అక్రమాలే అని ఆయన ఆరోపించారు.
ఆ అక్రమాలపై విజిలెన్స్ తో దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ ను కబ్జాల మయం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలపై 600పైగా ఫిర్యాదులు వచ్చాయని వెల్ల డించారు. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారని, ఇంకో 15 మంది అరెస్ట్ అవుతారని చెప్పారు. గత ప్రభుత్వంలో కబ్జా చేసిన భూములను స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించామని, లేకపోతే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కార్గో బిజినెస్ రూ.10 వేల కోట్లు ఉందని, అందులో 20 శాతం బిజినెస్ కార్గో ద్వారా చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.