- రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీకీ ఓటేయొద్దు: పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్‌లకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని, ముదిరాజ్‌లు తమ రోషం, పౌరుషం చూపించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ పద్మానాయక కల్యాణ మండపంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా వేర్వేరుగా నిర్వహించిన ముదిరాజ్ కుల బాంధువులు, గౌడ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కులాలు వేరైనా బీసీలమంతా ఒకటేనన్నారు. రేపు మంత్రి వర్గంలో ముదిరాజ్ బిడ్డ ఉంటారని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
పొరపాటున బీజేపీ గెలిస్తే బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తారని హెచ్చరించారు. రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీకి ఓటేయొద్దని ఆయన కోరారు. పైన జైశ్రీరాం అంటూ లోపల మాత్రం రిజర్వేషన్లకు రాం రాం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాజేందర్ రావు గెలుపును తన గెలుపుగా భావిస్తానన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.