సమస్యలపై ప్రజలు నేరుగా కలవొచ్చు : పొన్నం ప్రభాకర్​

చిగురుమామిడి, వెలుగు: ప్రజలు తమ సమస్యలపై నేరుగా తనను కలవొచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలో శనివారం ఆయన పర్యటించారు. లంబాడిపల్లి, గాగిరెడ్డిపల్లిలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాలను ప్రారంభించారు. మండలకేంద్రంలోని సర్దార్​సర్వాయి పాపన్న, అంబేద్కర్​విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

మంత్రి పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, యువత మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలను ఎన్నడూ మరిచిపోలేనన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

తనను కలవడానికి ఎవరి పైరవీలు వద్దని నేరుగా వచ్చి కలువొచ్చన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గీకురు రవీందర్, పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి. డీసీసీ అధికార ప్రతినిధి ప్రవీణ్​ కుమార్, నాయకులు పాల్గొన్నారు.