కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజల్లో ఆనందోత్సాహాలు. గడీల పాలన నుంచి ప్రజల కేంద్రంగా ప్రజాపాలన. అంతలోనే ఎంతమార్పు.. ప్రతి ఇంట్లో ఆర్థిక సిరులు. మహాలక్ష్మి కేంద్రంగా ప్రతి ఇంట్లో ఆర్థిక వృద్ధి. 100 రోజుల్లోనే సంక్షేమం, అభివృద్ధి, ప్రగతిపథంలో ఇందిరమ్మ రాజ్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలంతా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. తమకు కావాల్సిన అవసరాలను అధికారుల నుంచి మంత్రుల వరకు ఎక్కడా అడ్డుగోడలు లేకుండా స్వేచ్ఛగా అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన పాలన ఇది.
తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నా ఆ ఫలాలు అందక దశాబ్దకాలంగా నియంతృత్వ దొర గడీల మధ్య నలిగిన నా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేరోజున ఒకవైపు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణ నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టాం. ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చుకున్నాం. అప్పటివరకు అంబేద్కర్ సచివాలయంలోకి కనీసం ఎమ్మెల్యేలు కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. ఎన్నోసార్లు మా ఎమ్మెల్యేలు సీతక్కలాంటి వారు, మా పీసీసీ అధ్యక్షుడు అధికారులను కూడా కలవకుండా సచివాలయం ప్రధాన ద్వారం వద్దే ఆపేసిన దాఖలాలు ఉన్నాయి.
కానీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గంటలోపే సచివాలయంలోకి సామాన్యుడు కూడా వచ్చేవిధంగా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఎవరికివారు ప్రతి సామాన్యుడు కూడా స్వేచ్ఛగా సచివాలయంలోకి వచ్చి తమ సమస్యలను మంత్రులకు చెప్పుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే ఆ నలుగురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మాత్రమే. చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలన్నా కేసీఆర్, కేటీఆర్ ఫైనల్ చేయాల్సిందే.
ఇందిరమ్మ రాజ్యం
ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికివారు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. స్వేచ్ఛగా సమీక్షలు చేసుకోగలుగుతున్నారు. మంత్రులు ఉదయం లేచిన నుంచి పడుకునేవరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ 10 ఏండ్లలో గత సీఎం అసలు సచివాలయానికే రాకపోయేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా ప్రతిరోజు ఉదయమే సచివాలయానికి వస్తున్నారు.
వచ్చిన 100 రోజుల్లోపు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేసింది. మా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేశాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించాం. ఇప్పటివరకు 25 కోట్ల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న జీరో టికెట్ డబ్బులు ప్రతి రూపాయితో సహా మా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల మహిళా సాధికారత సాధిస్తున్నాం. ఇప్పటివరకు వారికి వచ్చే నెల జీతం కూడా ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా ఆదా చేసుకోగలుగుతున్నారు. ప్రతి ఇంటా ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు. ప్రజలు కన్న కలలు, కొత్త ఆశయాలు నెరవేరుతున్నాయి.
ఆర్టీసీ అన్నలకు చేయూత
గత ప్రభుత్వం10 ఏండ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. ఆర్టీసీ అన్నలు సుదీర్ఘ సమ్మెచేసి ఆత్మహత్యలు చేసుకున్నా కఠోరంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ, మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించాం. 2013 నుంచి సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ 50 శాతం పే స్కేల్ ఏరియర్స్, 280 కోట్ల విలువైన బాండ్స్ ని మా ప్రభుత్వం క్లియర్ చేసింది. అందుకు సంబంధించిన చెక్కులను ఇటీవల ఉద్యోగులకు అందించాం.
ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ 21శాతం ఫిట్మెంట్ ను అందించింది. ఈ ఫిట్మెంట్ వల్ల ప్రతి ఏటా ప్రభుత్వం పై రూ.418 కోట్ల భారం పడుతోంది. ప్రభుత్వంపై భారం పడినా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్టీసీలో 3,500 పోస్టులకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. టీఎస్పీఎస్సీ ద్వారా ఆర్టీసీ లో 72 మంది జూనియర్ అసిస్టెంట్ నియామకాలు పూర్తయ్యాయి. అందులో 12 మంది ఇప్పటికే విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.
ఫస్టు తారీఖునే జీతాలు
నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి శంకుస్థాపన చేసుకున్నాం. ధరణిపై కమిటీ వేసి ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న లక్షకు పైగా ధరణి సమస్యలను పరిష్కరించాం. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు 15వ తారీఖు తరువాతే జీతాలు పడేవి. వారు ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. కానీ, తమ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు పడేలా చేశాం.
తెలంగాణ ఉద్యమ సమయంలో మనందరి ఆకాంక్ష వాహనాల నంబర్ ప్లేట్స్ కి అప్పుడు ఏపీ నుంచి టీజీగా లక్షలాది వాహనాలకు పెట్టుకున్నాం. గత ప్రభుత్వం దానిని మన ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా టీఎస్‌గా మార్చింది. మన ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మళ్ళీ టీజీగా మార్చుకున్నం. అది ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చింది. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుని కులాల సాంకేతికత ద్వారా మారుతున్న కాలాలకు అనుగుణంగా వృత్తులు ఆర్థికవృద్ధి చెందేలా చర్యలు చేపట్టాం.
గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన బదిలీలు చేపట్టింది. దీనిపై చాలామంది ఉద్యోగులు స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 317 జీవోతోపాటు 46 జీవోలపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. నివేదిక వచ్చాక త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.
గద్దర్‌ను గౌరవిస్తూ..
తెలంగాణ ఉద్యమం అంటే గద్దర్ ఆయన పాట, ఆయన మాట ఉద్యమకారులకు ఆదర్శం. అలాంటి ప్రజా యుద్ద నౌక గద్దర్ ను గత ప్రభుత్వం అవమానించింది. గద్దర్ కి గత ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. కానీ మా ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాం. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. గద్దర్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలి
భారీ వర్షాలు పడి పంట నష్టపోతే గత ప్రభుత్వం కనీసం ఆదుకున్న పాపాన పోలేదు. పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాం. రైతు నేస్తం పథకం ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆన్లైన్లో శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నాం. మేము తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రాసెస్ ప్రారంభించాం. ప్రజా పాలన ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కోటి 5 లక్షల దరఖాస్తులు స్వీకరించాం.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఇంట్లో మా పథకాలు చేరాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఇంది రమ్మ రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుతున్నా. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోపే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసుకొని కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేశాం. వచ్చిన వెంటనే 30 వేల మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశాం. 11,062పైగా పోస్టులలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశాం. దశాబ్ద కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న 2008 బాధితులకు న్యాయం చేశాం. వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి కేబినెట్ తీర్మానం చేశాం. 563 పోస్టులలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి, గ్రూప్ 1,2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశాం.
గత దశాబ్ద కాలంగా మిలటరీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ రోడ్ల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలుకు వెళ్ళే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాం. రైతునేస్తం పథకం ద్వారా 5 ఏండ్లలో లక్ష కోట్లు ఖర్చుపెట్టి 60 లక్షల మందికిపైగా మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం.
బీసీలకు అండగా కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌కి వెయ్యి కోట్లు కేటాయించినప్పటికీ వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోయింది. బీసీలను విస్మరించింది. మా ప్రభుత్వం బీసీల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బీసీ హాస్టల్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సను రూ.10 లక్షలకు చేసింది.
ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయిన గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించింది. భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 4.5 లక్షల ఇండ్లను రూ.22,500 కోట్లతో నిర్మించనుంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది. రాష్ట్రంలో హనుమంతుడు గుడి లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇల్లులేని గ్రామం లేదు. గత ప్రభుత్వం అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అని ప్రత్యేక వంట గది, బాత్రూమ్ ఉండాలంటూ డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో మోసం చేసింది.
- పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి