హుస్నాబాద్,వెలుగు : ‘జై శ్రీరామ్ అంటూ వచ్చెటోళ్ల లోపల కుతంత్రం ఉన్నది. ఆ నినాదం వెనుక రాజ్యాంగానికి రాం రాం పలికే కుట్ర ఉన్నది. దేవుడి పేరుతో పబ్బతి పడుతూ ఓట్లడిగెటోళ్లను నమ్మితే రిజర్వేషన్లు ఉండవు’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
తర్వాత సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆ పార్టీ జనరల్‌బాడీ మీటింగులో మాట్లాడారు. ప్రజలు ఆలోచించి ఓటేయకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే రాజ్యాంగసూత్రాలను చేస్తారని, కాంగ్రెస్‌కు ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పొన్నం కోరారు. మొదటి దశ ఎన్నికల తర్వాత మోదీ కాంగ్రెస్‌పై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని, దేశ సంపదను ముస్లింలకు తరలిస్తారని ప్రజల మైండ్‌ను డైవర్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
దుకాణాల ముందు నీళ్లొస్తే నా క్యాంపు ఆఫీసు ముందు ధర్నా చేయండి
హుస్నాబాద్‌లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రాలను పరిశీలించిన మంత్రి పొన్నం మగ్గంపై కొద్దిసేపు బట్టలు నేశారు. అందరం కలిసి చేనేత వృత్తిని కాపాడుకోవాలని, తనకు శాలువాలు, బొకేలకు బదులు చేనేత టవెల్స్ ఇస్తే వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. చేనేత, నూలు మీద బీజేపీ జీఎస్టీ విధించిందని, దీంతో ఆ రంగం సంక్షోభంలో పడిందన్నారు.
ముఖ్యమంత్రితో మాట్లాడి చేనేత రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జీవో నంబర్ 1 తెచ్చామని, దీని ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బట్టలను టెస్కో ద్వారా కొనుగోలు చేసే వీలుంటుందన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మం డలం కొత్తకొండను మండలంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ గ్రామ ఎంపీటీసీ యాటబోలు రాజమణి, మాజీ సర్పంచ్ తులసీరాంతోపాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వానాకాలంలో హుస్నాబాద్ రోడ్లపై నీళ్లు పారకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం చెప్పారు. ఇక నుంచి ఇండ్లు, దుకాణాలు, రోడ్లమీదకు నీళ్లు వస్తే తన క్యాంపు ఆఫీసు ముందు ప్రజలు ధర్నా చేయవచ్చన్నారు.