నేత కార్మికుల సమస్యలను ఏనాడు పట్టించుకోని బండి సంజయ్ ఇపుడు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ శ్రీ వెంకటేశ్వరాలయాన్ని దర్శించకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కంటే పది శాతం ఎక్కువగా నేత కార్మికులకు వర్క్ ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడమనేది అంశమే కాదని... అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా పని కల్పిస్తామన్నారు. నేతన్నల సంక్షేమం కోసం ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
చేనేతపై 12 శాతం జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీదేనని.. ఆనాడే సిరిసిల్లకు బ్లాక్ డే అని చెప్పామన్నారు. కరీంనగర్ కు వచ్చిన టెక్స్ టైల్ జోన్ ను వరంగల్ కు తరలించారని చెప్పారు. సిరిసిల్లకు టెక్స్ టైల్ క్లస్టర్ తేవడంలో బండి సంజయ్ విఫలమయ్యారని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరిని ప్రకటించినా గెలిపించుంకుంటామన్నారు పొన్నం. జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నాం కానీ.. ఆయన నిజామాబాద్ కు వెళ్లడంతో కొంత అభ్యర్థిప్రకటనలో ఆలస్యం అయ్యిందన్నారు. సామాజిక అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తామని తెలిపారు.