హుజూరాబాద్/వీణవంక వెలుగు: పేదల భూములను గుంజుకుని భూదందాలు చేసినవాళ్ల బండారం త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం జూపాక గ్రామం, వీణవంక మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మలను ఆయన దర్శించుకున్నారు. ఆయనతోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. కరీంనగర్ పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై, భూదందాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీణవంకలో మాట్లాడుతూ 10 ఏండ్లపాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్‌లు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అమ్మవార్ల ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.