సిటీలో చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్

సిటీలో చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్
  • అధికారులపై మంత్రి పొన్నం సీరియస్ 
  • పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు మధ్య కోఆర్డినేషన్ ఉండట్లే
  • పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు ఫీల్డ్ లోనే ఉండాలి 
  • జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మాన్ సూన్ ప్రిపరేషన్ పై రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ అంతా చెత్తమయం అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. శానిటేషన్ విభాగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, అసలు శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పని చేస్తున్నారా? అని సీరియస్ అయ్యారు.

గ్రేటర్ లో మాన్ సూన్ ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, పోలీసులు, ఎలక్ర్టిసిటీ ఉన్నతాధికారులతో బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి మంత్రి పొన్నం నిర్వహించిన రివ్యూ హాట్ హాట్ గా జరిగింది. బల్దియాలో శానిటేషన్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ, నాలా, యూ బీ డీ, విద్యుత్ అంశాలపై విభాగాల వారీగా అధికారులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. రోజూ చెత్త కుండి పాయింట్స్ వద్ద చెత్త ఎందుకు క్లియర్ కావడం లేదని ప్రశ్నించారు. సిటీలోని 22 లక్షల ఇండ్లకు 4,500 స్వచ్చ ఆటోలు మాత్రమే ఎలా సరిపోతాయని సీరియస్ అయ్యారు.     

ట్రాఫిక్ పోలీసులు ఫీల్డ్ లోనే ఉండాలి  

జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, పోలీసుల మధ్య కోఆర్డినేషన్ ఎందుకు ఉండటంలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదనే ఉండాలని ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మార్ల వద్దకు పిల్లలు పోకుండా ఉండేందుకు అన్నిచోట్ల కంచెలు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అవరమైతే నిధులు కేటాయిస్తామన్నారు. కాగా, మంత్రి పొన్నంకు టౌన్ ప్లానింగ్ సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్ వివరాలు తెలియజేస్తున్న సమయంలో ఆయనకు ఫోన్ రావడంతో మంత్రితో చర్చ ఆపేసి ఫోన్ ఎత్తి మాట్లాడారు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు.

ఎంతో ముఖ్యమైన అంశంపై రివ్యూ చేస్తుండగా నన్ను పట్టించుకోకుండా ఫోన్ లో మాట్లాడుతున్నావేంటి? అధికారులతో ఫ్రెండ్లీగా ఉండాలనేదే నా ఉద్దేశం. కానీ ఇలా ప్రవర్తిస్తే ఊరుకోం” అని హెచ్చరించారు. కాగా, సిటీలో వర్షాలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేద్దామని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. రివ్యూ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కూడా నాలాల్లో చెత్త వేయకుండా, నీళ్లు సాఫీగా వెళ్లేలా చూడాలని కోరారు. 

అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ 

వర్షాకాలంలో సమస్యల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నాలాల్లో పూడికతీతతో పాటు వాటర్ లాగింగ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, నాలాల వద్ద ప్రికాషన్ బోర్డులు పెడుతున్నామని తెలిపారు. మాన్ సూన్, మొబైల్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు, కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు అలర్ట్ గా ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కాగా, సిటీలో గతేడాది125 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పాయింట్లను ఎత్తివేశామని, ప్రస్తుతం 32 మాత్రమే ఉన్నాయని నాలుగు రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. కానీ మంత్రి సమీక్షలో మాత్రం సమావేశంలో ఈఎన్ సీ జియా ఉద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వర రావు, సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీలు పాల్గొన్నారు.

నా డివిజన్ లో సైతం చెత్త ఎత్తట్లే: మేయర్ విజయలక్ష్మి
 
శానిటేషన్ అడిషనల్ కమిషనర్ తీరుపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం సమావేశంలో మండిపడ్డారు. తన సొంత డివిజన్ లో కూడా చెత్తను తొలగించడంలేదని సీరియస్ అయ్యారు. చెత్త ఉన్న చోట వీధి కుక్కలు పెరుగుతున్నాయని, అవి ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంటుందన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గుతున్నా నీళ్లు ఎక్కువ చోట్ల ఎందుకు నిలిచిపోతున్నాయని ప్రశ్నించారు.