హుస్నాబాద్ రేసులో పొన్నం .. పొత్తు కుదిరితే సీటు సీపీఐకే!

  • స్థానికంగా నివాసానికి ఏర్పాట్లు 
  • బరిలో పలువురు కాంగ్రెస్ బీసీ నేతలు
  • పొత్తు కుదిరితే  సీటు సీపీఐకే!
  •  వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్ అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ నిలవనున్నారు.  శుక్రవారం మంచి ముహూర్తం కావడంతో హుస్నాబాద్ పట్టణంలో ని  సిద్ధేశ్వర ఆలయం, పొట్లపల్లిలోని రాజన్న ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం పొన్నం తరపున ఆయన సోదరుడు పొన్నం రవిచంద్ర, పీసీసీ సభ్యులు సత్తు మల్లేశ్, నాగి శేఖర్  గాంధీ భవన్ లో కాంగ్రెస్​ టికెట్​కు దరఖాస్తును అందజేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్​ టికెట్​ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డికే ఖాయమని అనుకుంటుండగా అనూహ్యంగా పొన్నం రావడంతో  హాట్​ టాపిక్​గా మారింది. బీసీలు అత్యధికంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో బొమ్మ వెంకన్న తరువాత 15 ఏళ్లుగా బీసీలకు ప్రాతినిథ్యం దక్కలేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో బీసీలకు టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ వస్తున్న సమయంలో పొన్నం రంగంలోకి దిగడం విశేషం.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటు లో ఆమోదం పొందేటప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్  క్రీయాశీలక పాత్ర పోషించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పార్లమెంటుకు, అసెంబ్లీకి పోటీ చేసిన ఓటమి పాలైనాడు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యర్థులున్న  కరీంనగర్ కంటే హుస్నాబాద్ సేఫ్​ అని ఈ స్థానాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.  ఇందులో భాగంగా హుస్నాబాద్ లోనే నివాసం ఉండేలా ఆయన ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలు ఇండ్ల ను పరిశీలించగా మరికొన్ని రోజుల్లో ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నియోజకవర్గంలో విస్తృత పర్యటనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

పోటీలో బీసీ నేతలు

హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు బీసీ నేతలు పోటీ పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు అల్గీరెడ్డి ప్రవీణ్​ రెడ్డికే టికెట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ పేరును ప్రకటించడంతో   కాంగ్రెస్​ నుంచి పొన్నంతోపాటు  ఒంటెల రత్నాకర్, శివయ్య కూడా దరఖాస్తు చేసుకున్నారు.

పొత్తు కుదిరితే ఆశలు గల్లంతు

కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు కుదిరితే  పొన్నంతోపాటు అందరి ఆశలు గల్లంతవుతాయి. బీఆర్ఎస్ తో పొత్తు బెడిసికొట్టడంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వీరి మధ్య చర్చలు సఫలమైతే హుస్నాబాద్ సీటును సీపీఐకి కేటాయించడం ఖాయం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా సీసీఐ హుస్నాబాద్ నుంచి పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరాడు.  ఇటీవల  మళ్లీ ఆయన సొంత గూటికి చేరుకుని హుస్నాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ లో బీసీ నేతల టికెట్ ప్రయత్నాలకు తోడు కమ్యూనిస్టుల పొత్తు అంశంతో స్థానిక రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

మెజార్టీ ఓటర్లు బీసీలే

హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి.  సిద్దిపేట జిల్లా పరిధిలో  హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్కన్నపేట, కొహెడ,  కరీనంగనర్ జిల్లా పరిధిలో చిగురుమామిడి, సైదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హన్మకొండ జిల్లా పరిధిలో  భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలున్నాయి.  నియోజకవర్గంలో మొత్తం 2,30,902 ఓటర్ల లో పురుషులు 1,14,868, మహిళలు 1,16,032 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల లో దాదాపు 50శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్ల లో  గౌడ లే  అధికం. తరువాత స్థానంలో మున్నూరు కాపు,  ముదిరాజ్, పద్మశాలి ఓటర్లు ఉన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన దేశిని చిన మల్లయ్య నాలుగు సార్లు ఇక్కడి నుంచి  గెలుపొందారు. ఈ నేపథ్యంలో  గౌడ ఓటర్ల తో పాటు బీసీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు  పొన్నం  ప్రభాకర్ గౌడ్  ప్రయత్నాలు మొదలు పెట్టారు.