కరీంనగర్, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 10 పెండింగ్ పనుల పూర్తి కోసం వచ్చే బడ్జెట్ సెషన్లో నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. ‘కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు నా హృదయపూర్వక అభినందనలు. రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర, -రాష్ట్ర సంబంధాలను మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలి. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైంది’. అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా, కరీంనగర్ బిడ్డ గా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఈ లేఖ రాస్తున్నానని, ఇందులో 10 అంశాలను ప్రస్తావించారు. కరీంనగర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత బాధిత కుటుంబాలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనలో ప్రోత్సాహం అందించాలని, శాతవాహన యూనివర్సిటీకి రూ.200 కోట్ల ఆర్థికసాయం చేయాలని, కరీంనగర్– తిరుపతి మధ్య బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నడపాలని, కరీంనగర్– షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ పనులను వేగవంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
అలాగే హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ, కొత్తపల్లి నుంచి జనగామకు హైవే మంజూరు చేయాలని, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు, ఎన్ఎల్ఎం, పీఎంఈజీ, ఎన్ హెచ్ఎం స్కీమ్ ల కింద తగినంత బడ్జెట్ కేటాయించేలా చూడాలని కోరారు.