మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం పర్లల్లి గ్రామంలో వరి ధాన్య కేంద్రాలను ( ఐకేపీ) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో ఉన్న సమాచారానికి ప్రజా ప్రతినిథులు చెప్పేదానికి పొంతన లేదని ఆరోపించారు. 25 రోజులుగా ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రైతుల గురించి పట్టించుకోకుండా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని పొన్నం విమర్శించారు. రైతులకు అండగా ఉండేందుకు కలెక్టర్ కాళ్ళు మొక్కి వేడుకుంటున్నా...ప్రభుత్వానికి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సెంటర్లకు ధాన్యం ఎంత వచ్చింది. ఎంత మేరకు కొనుగోలు జరిగిందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని...మంత్రికి పొన్నం సవాల్ విసిరారు. రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి ఉత్సవాల పేరుతో ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యంపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలు దాచి పెడుతున్నారన్నారు. తిమ్మాపూర్ మండలంలో 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు ఉండగా గత వారం రోజుల్లో కేవలం 3 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కేవలం 2267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.