పొన్నం సత్తయ్య గౌడ్ మహోన్నత వ్యక్తి: స్పీకర్ గడ్డం ప్రసాద్

పొన్నం సత్తయ్య గౌడ్ మహోన్నత వ్యక్తి: స్పీకర్ గడ్డం ప్రసాద్

బషీర్ బాగ్, వెలుగు: పొన్నం సత్తయ్యగౌడ్​ మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​అన్నారు. భూమిని నమ్ముకున్న ఆదర్శ రైతు పొన్నం సత్తయ్య గౌడ్ అని, ఆయన కొడుకు పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సభ్యుడు అయిన కూడా నమ్ముకున్న వ్యవసాయాన్ని కొనసాగించారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు–2024  ప్రదాన కార్యక్రమం జరిగింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్​బాబుతో కలిసి స్పీకర్​ప్రసాద్​కుమార్​ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

మొదట పొన్నం సత్తయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్,  బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్యకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి పొన్నం సత్తయ్య పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన కుమారులు మంత్రి పొన్నం ప్రభాకర్ , సోదరులను అభినందించారు. బలగం సినిమాలో కొమురమ్మ, మొగిలయ్య పాడిన పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. 

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి బాధ కలిగిస్తున్నదని, వారికి తన జీతం నుంచి రూ.లక్ష తక్షణమే అందిస్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వారికి పెన్షన్​ వచ్చేలా చూస్తానిన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం, సంజయ్, శ్రీ గణేశ్, వీర్లపల్లి శంకర్, నాగరాజు, మేఘారెడ్డి, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్,  బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, వెలిచాల రాజేందర్ రావు, మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్​ దిలీప్ రెడ్డి, రచయిత్రి శ్రీ లక్ష్మి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్​పాల్గొన్నారు.

పొన్నం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు: మంత్రి శ్రీధర్​బాబు

కుటుంబ సంస్కృతీ, సంప్రదాయాలను ముందుకు తీసుకుపోతున్న పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు ధన్యవాదాలు తెలిపారు. పొన్నం ప్రభాకర్ మంత్రి అయినప్పటికీ..ఆయన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల సలహాలు, సూచనలను గౌరవిస్తారని చెప్పారు.  తెలుగు పాటను ఆస్కార్ స్థాయికి తీసుకుపోయిన ఘనత చంద్రబోస్​దని కొనియాడారు. కొమురమ్మ, మొగిలయ్య కుటుంబానికి  పెన్షన్ ,ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని , మొగిలయ్య చికిత్స విషయంలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. 

ఉమ్మడి కుటుంబ విలువలకు పొన్నం కుటుంబం నిదర్శనమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తమ అమ్మ, నాన్నకు చదువు రాకున్నా.. తమకు సంస్కారం నేర్పి, మంచిగా చదివించారని పొన్నం ప్రభాకర్​ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి నేర్పిన విలువలను పాటిస్తూ.. ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తమ కుటుంబం తరఫున కొమురమ్మకు వరంగల్ లో ఇల్లు కట్టిస్తామని, వారం రోజుల్లో మొగిలయ్య కు హైదరాబాద్ లో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో.. ఇప్పుడు స్థానిక కళాకారులతో కలిసి అవార్డు అందుకోవడం అంతే ఆనందంగా ఉన్నదని చంద్రబోస్​అన్నారు.