వరద నష్టం ముష్టి రూ.400 కోట్లు ఇచ్చారు..ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు

 వరద నష్టం ముష్టి రూ.400 కోట్లు ఇచ్చారు..ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు  మంత్రి పొన్నం ప్రభాకర్.   తెలంగాణకి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు.. వరదలతో  నష్టపోతే ముష్టి రూ. 400 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.  ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు  దద్దమ్మలు..  ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం.  కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వేపై విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 

 ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం  కులగణన  నిర్వహించబోతున్నామని చెప్పారు.  ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో  సర్వే చేస్తాం. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్నదే మా లక్ష్యం.  సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా‌‌ మారబోతుంది.  కుల గణనలో పాల్గొనే ఎన్యుమురేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళాలి‌. 

 బీసీ, ఎస్సీ, మైనారిటిల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు వారికి ఇవ్వాలి.  లక్ష రూపాయల రుణమాఫీని ఐదు దఫాలలో  చేసిన వాళ్లు మన  గురించి మాట్లాడితే ఊరుకోవద్దు.  మన పార్టీనీ తిడితే మన తల్లిని తిట్టినట్లుగా భావించాలి.   ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పార్టీలకతీతంగా ఇవ్వబోతున్నాం. ఇది‌ ఒక చారిత్రాత్మకమైనా ఘటనగా మిగిలిపోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.