ఒక తొమ్మిదేళ్ల అమ్మాయికి మామూలుగా అయితే ఎలాంటి లక్ష్యాలుంటాయి. క్లాస్ ఫస్ట్ రావటం, మంచి మార్కులు తెచ్చుకోవటం… ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ మూడేళ్లప్పుడు రన్నింగ్ రేస్‌లో ఓడిపోయానని అదే చాలెంజ్‌గా తీసుకొని ఒలింపిక్స్‌ని టార్గెట్ చెయ్యటం ఎప్పుడైనా విన్నారా? రాజస్థాన్ లోని జోద్‌పూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల పూజా బిష్ణోయ్ మూడేళ్లప్పుడు ఓడిపోయి తన ఇగో దెబ్బతిన్నందుకు ఆ పరుగుపందెం అంతేమిటో చూడాలనుకుంది. ఆ పంతమే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి రన్నర్‌ని చేసింది. అయినా అంతటితో ఆగకుండా ఒలింపిక్స్ మీదే గురిపెట్టింది ఈ అమ్మాయి.
పూజ అమ్మా నాన్నా రైతు కూలీలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయితేనేం మూడేళ్లు కూడా నిండని పూజ టార్గెట్ ఏమిటో అర్థం చేసుకున్నారు. తమ శక్తికి మించి కష్టపడి మరీ, కూతురికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మామయ్య ‘సర్వాన్’ కూడా అథ్లెట్. ఆయన ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జోథ్‌పూర్’ సభ్యుడు కూడా. ఒక యాక్సిడెంట్ వల్ల ఇంటర్నేషనల్ రన్నింగ్ ట్రాక్స్ మీద పరుగులు తీయాలనుకున్న అతని కల మధ్యంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మేనకోడలితో ఆ కలను తీర్చుకోవాలి అనుకుంటున్నానని చెప్తున్నాడు సర్వాన్.
ఆరేళ్లప్పుడు 2017లో ‘జోధ్‌పూర్ మారథాన్’లో 10 కి.మీ దూరాన్ని 48 నిమిషాల్లో పూర్తి చేసింది. అంత చిన్న వయసులోనే పూజ సిక్స్‌ప్యాక్ బాడీ చూసి షాక్ తిన్నారు ప్రేక్షకులు. 50 వేలమందికి పైగా ఫాలో అవుతున్న పూజ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ సిక్స్ ప్యాక్ ఫొటోలని చూడొచ్చు. ఆతర్వాత అలాగే వరుసగా 3 వేల మీటర్లు, 15 వందల మీటర్లు, 8 వందల మీటర్ల రన్నింగ్ లో బంగారు పతకాలు సాధించింది. 2019 నవంబరులో ఢిల్లీలో ‘స్పోర్టిగో’ టోర్నమెంట్‌లో 3 కి.మీ దూరాన్ని 12.50 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసి అండర్ 14 ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టింది.
పూజ కోచింగ్ పొద్దున 3 గంటలకి మొదలవుతుంది. నాలుగు గంటల పాటు వామప్, ఎక్సర్‌సైజ్ ఆ తర్వాత రన్నింగ్. 7 గంటలకి స్కూల్ మొదలవుతుంది ( ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులకి అటెండ్ అవుతోంది) సాయంత్రం స్కూల్ అయిపోయాక మళ్లీ ప్రాక్టీస్ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10 గంటలకల్లా నిద్ర పోవాల్సిందే. ఏడు గంటల నిద్ర కచ్చితంగా పాటిస్తుంది. 2024లో జరిగే యువ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనాలి. బంగారు పతకం సాధించాలన్నదే నా లక్ష్యం’ అంటోంది పూజా బిష్ణోయ్.
పూజ ఎంతో శ్రద్ధగా శిక్షణ తీసుకుంటోంది. అయితే పోటీల్లో పాల్గొనాలంటే ఇప్పుడున్న ఫిట్‌నెస్ సరిపోదు ఇంకా మంచి పోషకాహారం తీసుకోవాలి. కాని ఆమె తల్లిదండ్రులకు ఆ స్థోమత లేదు. ఉన్న కొద్దిపాటి సౌకర్యాలతోనే శిక్షణ తీసుకుంటోంది. పూజా రన్నింగ్ వీడియోలను చూసిన ప్రముఖ క్రికెటర్ కోహ్లీ ఆమెకు మద్దతుగా నిలుస్తానని 2019లో చెప్పాడు. ఆ సపోర్ట్ కూడా తోడైతే ఒలంపిక్స్‌కి వెళ్లటం పూజకి పెద్ద కష్టమేం కాదు.
Read more news…