వరంగల్, వెలుగు : హనుమకొండ ఏషియాన్మాల్ పక్కన మూడేండ్ల క్రితం నిర్మించి ఎవరికీ కేటాయించకుండా వదిలేసిన డబుల్‍బెడ్‍రూం ఇండ్ల తాళాలను పేదలు కట్టెలు, రాడ్లతో పగులగొట్టి లోపలకు వెళ్లారు. దుమ్ము, ధూళితో ఉన్న ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లలతో సహా అక్కడే ఆందోళనకు దిగారు.
ఇంకొందరు కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ ‘కేసీఆర్వచ్చి గుడిసెల్లో ఉన్న మాకు ఏడాదిలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిండు. అదేమాట మీద మేం ఇక్కడ తాటిపత్రిలు, ఫ్లెక్సీలతో గుడిసెలు వేసుకుని ఉన్నం. ఏడాదిపోయి ఎనిమిదేండ్లు కావస్తోంది. ఎండలకు ఎండుతున్నం..వానలకు తడుస్తున్నం. గుడిసెల్లోకి పాములు, తేళ్లు వస్తున్నయ్.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారైనా సాయం చేయాలె’ అని వేడుకున్నారు. గతంలో కలెక్టర్, అధికారులు సర్వే ప్రకారం అర్హుల జాబితా తయారు చేశారని, అందులో ఉన్న తమకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడి
లబ్ధిదారులకు న్యాయం చేస్తామని పోలీసులు సముదాయించి పంపించారు.