కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో రూ.కోట్లతో చేపడుతున్న రోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులు తదితర నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. వర్క ఇన్ స్పెక్టర్లు, ఏఈల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా నిర్మాణాలు చేపడుతున్నారు.
పూర్ క్వాలిటీ..
సీసీ రోడ్లు వేస్తున్నపుడు అడుగు భాగంలో మూడు ఫీట్ల మేర నాణ్యమైన కాంక్రీట్ వినియోగించాల్సిన చోట నాసిరకం వాడుతున్నారు. కేవలం పైన లేయర్ మాత్రమే కొద్దిగా సిమెంట్ ఎక్కువగా పోసి నున్నగా చేస్తున్నారు. దీంతో కొద్ది రోజులకే రోడ్లపై కంకర లేస్తోంది. కట్ట రాంపూర్ గిద్దె పెరుమాండ్ల టెంపుల్ పక్క వీధిలో వేసిన సీసీ రోడ్ నిర్మాణంలో క్వాలిటీ పాటించడం లేదు. రోడ్ అడుగులో మూడు ఫీట్ల మేర పూర్తిగా సిమెంట్, కంకర, ఇసుక సమ పాళ్లలో కలపాలి. కానీ డస్ట్, ఇసుక, కంకర కలిపి పనులు చేస్తున్నారు. గాయత్రీ నగర్ లో నాసిరకంగా మోరీ నిర్మించారు. మోరీ లో మురుగునీరు పారుతుండగానే బెడ్ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీగలగుట్టపల్లి రెడ్డి ఫంక్షన్ హాల్నుంచి ఆర్టీసీ కాలనీ రోడ్ లో నిర్మించిన డ్రైయిన్ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. అలాగే భగత్ నగర్ శివాలయం వెనక వైపు ఎన్ జీఓస్ కాలనీ పెద్ద రోడ్డు నుంచి స్ర్టోమ్ వాటర్ డ్రైయిన్ పోవాల్సి ఉంది. కానీ ఉద్యోగులంతా అధికారులను కలిసి వారి ప్లాట్ల వైపు కాకుండా మరో స్ర్టీట్ నుంచి డ్రెయిన్తీయించారు. ఇక్కడ అటూ ఇటూ పోగా 25 ఫీట్ల రోడ్డు కూడా లేదు. ఇందులో స్ర్టామ్ వాటర్ డ్రైయిన్ నిర్మిస్తున్నారు. దీంతో రోడ్డు మరింత కుచించుకుపోతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.