AFG vs NZ: ఏంటి ఈ దుస్థితి..! రెండు రోజులు కావొస్తున్నా ప్రారంభం కాని మ్యాచ్

నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయే కనిపిస్తోంది. ఇప్పటికీ రెండ్రోజులు గడిచిపోగా ఒక్క బంతి పడలేదు. ఆఖరికి టాస్ కూడా వేయలేదు. పోనీ, అక్కడ భారీ వర్షమేమైనా ఉందా..! అంటే అదీ లేదు. వారం రోజుల క్రితం అక్కడ వర్షం పడగా.. నిర్వాహకులు వేదికను సిద్ధం చేయలేకపోతున్నారు. 

డ్రైనేజీ సిస్టమ్‌ వరస్ట్

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్ఘనిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడే పరిస్థితులు లేకోవడంతో బీసీసీఐ.. ఆ జట్టు మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించుకునేందుకు సహకరిస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్టుకు నోయిడాలోని క్రికెట్ స్టేడియాన్ని ఇచ్చింది. అయితే ఏ మాత్రం నిర్వహణ సరిగ్గా లేని ఈ స్టేడియాన్ని అందుకు కేటాయించడం విమర్శలకు దారి తీస్తోంది. వారం రోజుల క్రితం తడిచిన స్టేడియం ఇప్పటికీ మ్యాచ్ ప్రారంభానికి నోచుకోలేకదంటే వేదిక నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. వర్షపు నీరు ఆవిరవ్వడం తప్ప.. బయటకు పంపించే మార్గమే లేదు. అదీ ఈ స్టేడియం డ్రైనేజీ సిస్టమ్‌ వ్యవస్థ. అందువల్ల స్టేడియం సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.

స్టేడియంలో మంటలేస్తున్నారు..

తడిచిన ప్రదేశాలు ఎంతకీ రాకపోవడంతో మైదాన సిబ్బంది కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. కొంత మేరకు తడిగా ఉన్న ప్రదేశాలను టేబుల్ ఫ్యాన్లచే ఆరబడితే.. బాగా తడి ఉన్న ప్రదేశాలలో ఏకంగా మంటలేస్తున్నారు. అలా చేస్తే మంట వేడికి తడి ఆవిరవుతుందనేది వారి నమ్మకం. ఈ స్టేడియంలో జరుగుతున్న మరో వింత ఏమిటంటే.. మైదానంలో కొన్ని కొన్ని ప్రదేశాలను తొలగించి వాటి స్థానంలో కొత్త  ప్యాచ్‌లు అమరుస్తున్నారు. ఇలాంటి వేదికను అంతర్జాతీయ మ్యాచ్‌కు కేటాయించిన బీసీసీఐ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పాక్ క్రికెట్‌పై విమర్శలు

పొద్దస్తమానం పాక్ క్రికెట్‌పై ఏడ్చే మాజీలు, విమర్శకులు ఈ స్టేడియం నిర్వహణపై నోరు మెదపాలని భారత క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్, జట్టు స్పాన్సర్ షిప్‌లు, ఐసీసీ టోర్నీలు ద్వారా వచ్చే ఆదాయం ఏమవుతోందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొన్న కొందరు అభిమానులు ప్రతి రోజూ స్టేడియానికి వెళ్తూ.. అక్కడ జరుగుతున్న సన్నివేశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.