- 2021లో కాల్వల పరిస్థితిపై మెకానికల్ విభాగంతో సర్వే
- రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా రిపోర్ట్అయినప్పటికీ
- మరమ్మతులపై నిర్లక్ష్యంపూడికతీత, రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి
- 10వేల ఎకరాల ఆయకట్టున్న కాల్వలకు ప్రాధాన్యం
హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ఉన్న కాల్వల పరిస్థితి అధ్వానంగా మారింది. పదేండ్లుగా వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొన్నది. కాల్వల్లో పూడిక పేరుకుపోయి.. కంప చెట్లు పెరిగి దారుణంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల గేట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రైతులకు సాగు నీరు అందడం లేదు. 2021లో వివిధ డిస్ట్రిబ్యూటరీలపై మెకానికల్ స్టడీ చేయించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటరీ గేట్లు దారుణంగా తయారయ్యాయని తేలింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీల వారీగా విభజించి అధికారులకు రిపోర్టు ఇచ్చినా.. వాటిని మరమ్మతులు చేయించిన దాఖలాల్లేవు. దాదాపు 70 శాతం వరకు డిస్ట్రిబ్యూటరీలు రెడ్ జోన్లోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
లక్ష కోట్లు ఖర్చు చేసి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలన్న లక్ష్యంతో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల రిపేర్లకు ఇరిగేషన్ శాఖ కసరత్తు చేస్తున్నది. కాల్వల రిపేర్లకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి ఎస్టిమేట్స్ తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిధులున్నా.. పట్టించుకోని ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లు
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల, సింగూరు, ఎల్ఎండీ, కడెం, కుమ్రంభీం సహా దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోని డిస్ట్రిబ్యూటరీలు ముళ్ల కంపలతో నిండిపోయాయి. గేట్లు కూడా పని చేయడం లేవు. ప్రతి జిల్లాకు సంబంధించి కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల గేట్ల మెకానికల్ రిపేర్లకు సంబంధించి ఆయా జిల్లాల ఫీల్డ్ అధికారులకే.. ఓ అండ్ ఎం విభాగం అధికారాలిచ్చింది. వారికి రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఓ అండ్ ఎం నిధులు కూడా ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. గేట్లు రిపేర్ చేయించాలని గతంలో ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా.. ఫీల్డ్ లెవెల్ అధికారులు నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. కొన్నిచోట్ల రైతులే డబ్బులు జమ చేసుకుని గేట్లకు రిపేర్లు చేయించుకున్నారు.
జంగిల్ క్లియరెన్స్‌పై కసరత్తు
ప్రస్తుతం అధికారులు కాల్వల రిపేర్లపై దృష్టి పెట్టారు. తొలుత 10 వేల ఎకరాల ఆయకట్టున్న కాల్వలను రిపేర్ చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పూడికతీసి సాఫీగా నీళ్లు పారేలా పనులు చేయించనున్నారు. ఇటు జంగిల్ క్లియరెన్స్‌పై కసరత్తు చేస్తున్నారు. పూడికతీతకే ఎక్కువ నిధులు ఖర్చవుతాయని అధికారులు అంటున్నారు. గేట్ల మెయింటెనెన్స్‌కు సంబంధించి గ్రీజింగ్, ల్యూబ్రికేషన్, ఖరాబైపోయినవి ఉంటే రీప్లేస్మెంట్ వంటి పనులు చేయించాలని నిర్ణయించారు. ప్రధాన కాల్వలకు లైనింగ్ పనులు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇదీ కొన్ని జిల్లాల్లో కాల్వల పరిస్థితి..
ఆసిఫాబాద్ నియోజకవర్గం అడ గ్రామంలోని పెద్దవాగుపై నిర్మించిన కుమ్రంభీం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి 15 ఏండ్లు దాటింది. సుమారు రూ.751 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. ఇప్పటికీ సగం ఆయకట్టుకు కూడా సాగు నీరు అందడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్ మండల పరిధిలో 6 వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్ టీ మండలాల్లో 45,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ప్రాజెక్టు ఇది. కుడి కాలువ చాలా చోట్ల ధ్వంసమైంది. ఆసిఫాబాద్ మండలం మాణిక్గుడా వద్ద తూము దెబ్బతిని మరమ్మతులకు నోచుకోలేదు.
ఖమ్మం జిల్లా మధిర సెగ్మెంట్ పరిధిలోని ఎరుపాలెం మండలం కొత్తపాలెం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ కాల్వ.. కంప చెట్లతో నిండిపోయింది. నీళ్లు రిలీజ్ చేసినా ముందుకెళ్లని పరిస్థితి. కల్వర్టు లాక్‌లు శిథిలావస్థకు చేరాయి.
హుజూరాబాద్ మండలం రంగాపూర్, సిర్సపల్లి, వెంకట్రావుపల్లె వరకు కెనాల్స్, తూములు దెబ్బతిన్నాయి. కెనాల్స్‌లో కంప చెట్లు నిండటంతో నీళ్లు సరిగ్గా పారడం లేదు. కొన్ని చోట్ల రైతులే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వేసుకొని మరమ్మతులు చేయించుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీలు జంగిల్‌తో నిండిపోయాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ఇప్పటి వరకు కాల్వలకు లైనింగ్ చేయలేదు. 2 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉన్నా.. కేవలం 1,10,000 ఎకరాలకే నీళ్లిస్తున్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద పారే నీళ్లతో పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. గత పదేండ్లలో రామగిరి మండలంలోని ఎస్సారెస్పీ డీ 86 కాలువలు ఓపెన్ కాస్టుల నిర్మాణంతో ధ్వంసమయ్యాయి. దీంతో మంథని, ముత్తారం, రామగిరి మండలాలకు సాగునీరు అందడం లేదు. ఆయకట్టు రైతులు.. గోదావరి మీద ఉన్న పోతారం, ఆరెంద వద్ద లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని పోరాటం చేశారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పరిధిలోని సరస్వతి కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. నిర్మల్ జిల్లాలో 38వేల ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఈ కాలువ లైనింగ్, డిస్ట్రిబ్యూటరీలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఈ కాల్వ ద్వారానే సదర్ మాట్ బ్యారేజ్ కు మరో 16వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలో అధికారులు ప్రతిపాదనలు పంపినా.. నిధులు మంజూరు చేయలేదు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని డిస్ట్రిబ్యూటరీ, ఉప కాల్వలు దెబ్బతిన్నాయి. దీంతో కడెం ఆయకట్టు చివరి భూములకు సాగునీరందడం లేదు. కడెం ప్రాజెక్ట్, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా తానిమడుగు, నెల్కివెంకటాపూర్ 30వ డిస్ట్రిబ్యూటరీ కాలువ కింది వరకు ఉన్న సబ్ కెనాల్స్ శిథిలం అయ్యాయి. కాల్వ సిమెంట్ లైనింగ్ దెబ్బతిని సైడ్ వాల్స్ కూలిపోయాయి. కంప చెట్లు, రాళ్లతో నిండిపోయాయి.
ఉపాధి హామీకి అనుసంధానించడంలో నిర్లక్ష్యం
డిస్ట్రిబ్యూటరీల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధిహామీ కింద కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేపట్టి ఉంటే కాల్వలు బాగయ్యేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చు కూడా తగ్గేదని అంటున్నారు. ఎప్పుడు ఉపాధిహామీ కింద అప్లికేషన్లు పెట్టుకున్నా.. కేవలం ఎంపీడీవో లెవెల్లోనే లెటర్ ఇచ్చి మమ అనిపించారని తెలిసింది. ఉపాధిహామీ కింద ఏదైనా పనిని రిజెక్ట్ చేసే అధికారం కలెక్టర్‌కే ఉన్నా.. అసలు ఆ అప్లికేషన్లను కలెక్టర్ వరకు తీసుకెళ్లకుండానే ఆపేసి.. ఎంపీడీవో స్థాయిలోనే కొందరు అధికారులు రిజెక్ట్ చేయించారన్న ఆరోపణలూ వస్తున్నాయి.