తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అసైన్డ్ భూముల సేకరణ పేద రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి 50 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 30 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములే. గతంలో భూమి లేని పేదలకు, వ్యవసాయ కూలీలకు ఆయా ప్రభుత్వాలు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధం. అసైన్డ్ భూ యాజమానులకు లబ్ధి చేకూర్చుతామనే పేరుతో పట్టణ ప్రాంతాల్లో, రోడ్డుకు దగ్గరగా ఉన్న అసైన్డ్ భూములను వెంచర్లుగా మార్చడం రైతు వ్యతిరేక చర్యే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చూస్తున్న భూములు రైతుల చేతికి అంత సులభంగా రాలేదు. మొదటి దశ భూసంస్కరణలకు ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దేశ స్వాంతంత్య్ర పోరాటం జరిగాయి. రెండో దశ సంస్కరణలకు దేశవ్యాప్త భూమిలేని పేదల, రైతు కూలీల పోరాటలు కారణమయ్యాయి.
మౌలిక సదుపాయాల కల్పన
భూమి కేవలం తిండినిచ్చే సాధనం మాత్రమే కాదు. అదొక సామాజిక హోదా, ఆత్మ గౌరవం. అసైన్డ్ భూములు పొందిన వారిలో దాదాపు ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన కులాల వారే ఉంటారు. వారి చేతుల్లో నుంచి భూమి చేజారిపోతే.. వారు కోల్పోయేది కేవలం భూమి మాత్రమే కాదు. దీర్ఘకాల పోరాటం ఫలితంగా సాధించుకున్న సామాజిక హోదా, ఆర్థిక వనరు, ఆత్మగౌరవం కూడా. పంచిన భూములు నిజమైన లబ్ధిదారుల చేతుల్లోంచి జారిపోతున్నాయనేది కూడా కొంత నిజమే. అయితే ఈ పరిస్థితికి మూల కారణాలు ప్రభుత్వం నియమించిన కొనేరు రంగారావు కమిటీ లేవనెత్తింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన దళితులకు భూ పంపిణీ పథకంలో వ్యవసాయానికి మౌలిక సదుపాయాల కల్పన జోడించింది. ఇప్పటికీ దేశంలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సుదీర్ఘ కాలంగా పేదలకు భూ పంపిణీ పథకాలు అమలు చేస్తున్నట్లు నివేదికలు, పథకాలు, ప్రభుత్వాల ప్రచారాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అధిక జనాభా చేతిలో భూమి లేదు. భూ సంస్కరణలు అమలు ప్రారంభమై 75 ఏండ్లు అవుతున్న ఈ సమయంలోనూ భూ సంస్కరణలు ఎంత వరకు విజయవంతం అయ్యాయనే ప్రశ్నకు జవాబు దొరకదు.
రీ అస్సైన్డ్కు అవకాశం ఉన్నా..
1977లో అసైన్డ్ భూ బదిలీ నిషేధ చట్టం వచ్చింది. అసైన్డ్ లబ్ధిదారుల అవసరాలను ఆసరా చేసుకొని ఇతరులు ఆ భూములను అన్యాక్రాంతం చేయకూడదని ఆ చట్టం ముఖ్య ఉద్దేశం. గత 60 ఏండ్ల నుంచి అసైన్డ్ పట్టాలు పొంది సాగు చేసుకునే రైతుల నుంచి ప్రభుత్వం ఏక పక్షంగా భూమి గుంజుకోవడం చట్టవిరుద్ధమే అవుతుంది. ఒక అసైన్డ్ లబ్ధిదారుడి వద్ద నుంచి మరొక పేద రైతు అసైన్డ్ భూమి కొనుగోలు చేయడం కూడా చట్ట విరుద్ధం కాదు. అలా యాజమాన్య మార్పిడి జరిగిన విషయాన్ని మండల తహసీల్దార్ విచారించి కొనుగోలు జరిగిందని భావిస్తే.. అసైన్డ్ యజమాని అమ్మిన భూమిని కొన్న మరో వ్యక్తికి చట్టప్రకారం అర్హతలు ఉంటే ఆ బదిలీని చట్టబద్ధం చేయాలని1977 భూ అసైన్డ్ భూ బదలాయింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5 చెబుతోంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2007లో, 2017లో రెండు సార్లు సవరణలు జరిగాయి. 2017 జనవరి 13 తేదీ లోపు అసైన్డ్ భూములు కొన్న అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులకు భూమి రీ అసైన్డ్ చేయలేదు. పైగా దరఖాస్తులను భూ పంపిణీ స్ఫూర్తితో పరిశీలించకుండా ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, భూమిపైనే ఆధారపడిన పేద రైతాంగం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి దరఖాస్తులు పెండింగ్ లో ఉండగానే సెక్షన్ 3 సెక్షన్ 4 పీవోటీ చట్టం1977 కింద నోటీసులు ఇచ్చి భూములను ఏక పక్షంగా స్వాధీనం చేసుకోవడం సరికాదు.
వ్యవసాయం లాభసాటిగా లేదని..
భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొదలైన తర్వాత దాని విలువ అనూహ్యంగా పెరుగుతోంది. ఏ ప్రాంతంలో ఏ భూమి విలువ పెరుగుతుందనేది అతి కొంత మందికి తెలుస్తోంది. స్థిరాస్తి వ్యాపారం జోరందుకున్న తర్వాత కొద్దిపాటి మొట్ట పంటలు పండే భూముల ధరలు కూడా ఊహకందకుండా కోట్లలో పెరిగిపోయాయి. ఈ పరిణామ క్రమంలో పేద, మధ్యతరగతి చేతిలో ఉన్న భూములు 90 శాతానికి పైగా చేజారిపోతున్నాయి. పట్టణీకరణ ఇతర కారణాల వల్ల రియల్ఎస్టేట్రంగం హైదరాబాద్ నగరం దాటి మారుమూల పల్లెలనూ తాకింది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం లాభసాటిగా లేని వ్యవసాయం చేసి అప్పులపాలయ్యే బదులు రూ. లక్షలు, కోట్లకు భూమి అమ్ముకుంటే మంచిదే కదా అనే స్థితిలోకి రైతు వెళ్తున్నాడు. కోటి రూపాయల విలువైన భూమిలో ఏ పంట పండిస్తే మాత్రం సంతృప్తికరమైన లాభం వస్తుంది? ఇలా సంక్షోభితమైన వ్యవసాయ రంగాన్ని చూపించి అభద్రతలో ఉన్న రైతుల చేతి నుంచి భూమి అన్యాక్రాంతం అవుతోంది.