పేదరికాన్ని జయించి.. మెడికల్​ సీటు సాధించిన్రు

పేదరికాన్ని జయించి.. మెడికల్​ సీటు సాధించిన్రు

వెలుగు, నెట్‌వర్క్: వాళ్లంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. తమ చదువు కోసం తల్లిదండ్రులు పడ్తున్న కష్టాలను కళ్లారా చూశారు. ‘నువ్వు ఎలాగైనా డాక్టర్ కావాలి’ అన్న తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం కొందరు, తామే సొంతంగా లక్ష్యం పెట్టుకొని చదివి మరికొందరు సక్సెస్ అయ్యారు. కార్పొరేట్ కాలేజీల్లో లక్షలు పోసి కోచింగులు తీసుకున్నా రాని సీటును, పట్టుదలతో చదివి సాధించారు. ‘నీట్’లో మంచి ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్‌లో చేరారు. శుక్రవారం సీఎం కేసీఆర్​ వర్చువల్ పద్ధతిలో తొమ్మిది జిల్లాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించగా.. సీట్లు పొందిన పలువురు స్టూడెంట్లు ‘వెలుగు’తో తమ అనుభవాల్ని పంచుకున్నారు.

నాన్న గొర్లు కాస్తూ చదవించిండు

మా తండ్రి బీరమల్లు గొర్లకాపరి. ఆయన ఎండనక, వాననక కష్టపడుతూ నన్ను, తమ్ముణ్ని చదివించిండు. ఆయన కష్టాలను దగ్గర నుంచి చూసిన. ఎలాగైనా బాగా చదివి డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న. పట్టుదలతో చదివి సీటు సాధించిన. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది.‑ ముడిగి కుమార్, రేచిని, మంచిర్యాల

అమ్మానాన్న కండ్లల్ల ఆనందం చూసిన


నాన్న ఆటో నడుపుతాడు. ఆ చాలీచాలని సంపాదనే మా కుటుంబానికి ఆధారం. నాన్న కష్టం చూసి ఎలాగైనా డాక్టర్​ కావాలనుకున్న. అందుకే కష్టపడి చదివి సీటు సాధించిన. మా అమ్మ, నాన్నల కండ్లల్లో ఆనందం చూసి పడ్డ కష్టమంతా మరిచిపోయిన. కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీలేదు.
‑ కె రమ్య, కమలాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా

కుటుంబానికి అండగా ఉంట


మా తండ్రి మర్తూజ్ అలీ బిష్వాస్ హోటల్​లో టీ మాస్టర్. వేడి పొయ్యి దగ్గర చెమటలు కక్కుతూ పనిచేస్తడు. ఆయన సంపాదనతో మా కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఆయన కష్టం చూడలేక ఎలాగైనా డాక్టర్​ కావాలని కష్టపడి చదివిన. అనుకున్నట్లే ప్రభుత్వ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఇప్పుడు కూడా కష్టపడి చదవి డాక్టరై, మా కుటుంబానికి అండగా ఉంట. ‑ నషీం బిష్వాస్ , సికింద్రాబాద్

ALSO READ: మియాపూర్ భూముల  స్కాం, నయీం కేసు ఏమైంది? : ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ 

నాన్నే ఆదర్శం..


మా నాన్న ఆర్ఎంపీ. ఆయనను చూసి ఎలాగైనా డాక్టర్ కావాలనుకున్న. కానీ మాది పేద కుటుంబం. నాన్న సంపాదన అంతంతమాత్రమే. ఫ్రీ సీటు వస్తే తప్ప చదవలేని పరిస్థితి. అందుకే కష్టపడి చదివిన. సర్కారు పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు పెట్టడం కూడా మాకు కలిసి వచ్చింది. నాకు భూపాలపల్లిలో ఫ్రీ సీటు వచ్చింది. కష్టపడి చదివి పెద్ద డాక్టర్‌‌‌‌నై మా నాన్న కల నిజం చేస్త.
‑ కురువ శ్రావణి, గద్వాల

పేదలకు సేవ చేస్త


మాది మధ్య తరగతి కుటుంబం. అమ్మ బీడీలు చుడుతుంది. మా నాన్న ప్రైవేట్ టీచర్. ఇద్దరూ కష్టపడి నన్ను చదివించారు. నన్ను డాక్టర్‌‌‌‌గా చూడాలనేది వాళ్ల కల. అందుకే కష్టపడి చదివి నీట్‌‌లో మంచి ర్యాంకు సాధించిన. దీంతో రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. భవిష్యత్‌‌లో డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవ చేస్త.
- సుచరిత, గూడెం గ్రామం,  ముస్తాబాద్ మండలం, సిరిసిల్ల

కూలిపనులకు వెళ్తూ చదివిన


చిన్నప్పుడే నాన్న చనిపోయిండు. మా అమ్మ కూలి పనులు చేసుకుంటూ నన్ను పెంచింది. పదో తరగతి వరకు ఊళ్లోని సర్కారు బడిలో చదివిన. మా అమ్మ పడ్డ కష్టాన్ని దగ్గర నుంచి చూసి ఎంతో నేర్చుకున్న. పుట్టెడు కష్టాల్లోనూ గుండె నిబ్బరంతో ఎలా ఉండాల్నో అర్థం చేసుకున్న. అమ్మ తన కూలీ డబ్బుల్లో రూపాయి కూడా ఎప్పుడూ సొంతానికి వాడుకోలేదు. అంతా నాకోసమే ఖర్చు పెట్టింది. మూడేండ్లుగా నేను కూలి పనులకు వెళ్తూ చదువుకున్న. పార్ట్ టైం జాబ్‌తో పాటు క్యాటరింగ్ పనికి కూడా వెళ్లిన. ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు రావడంతో జాయిన్ అయిన. డాక్టర్ అయి మా అమ్మ కష్టం తీరుస్త.
- రామావత్ కోటేశ్, పెద్దవూర, నల్గొండ జిల్లా