ఒక్క ఇల్లు కట్టలే.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదల ఎదురుచూపులు

ఒక్క ఇల్లు కట్టలే.. డబుల్  బెడ్రూం ఇండ్ల కోసం పేదల ఎదురుచూపులు

నారాయణపేట, వెలుగు:  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టి పేదలకు పంపిణీ చేయగా, నారాయణపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కొన్నిచోట్ల పునాదులు, పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోగా, మరికొన్ని చోట్ల స్లాబ్​ వరకు నిర్మించి వదిలేశారు. 60 శాతం పనులు అసలు ప్రారంభమే కాలేదు. కనీసం స్థలం కూడా ఎంపిక చేయలేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7 లక్షలు ప్రభుత్వం ఇస్తుండగా, ఇవి సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రజాప్రతినిధులు  కలగజేసుకుని సపోర్ట్​ చేస్తామని హామీ ఇచ్చి టెండర్​ వేయించారు. తీరా పనులు ప్రారంభమయ్యాక చేతులెత్తేయడంతో కొంతమేర పనులు చేసి ఆపేశారు. ఇండ్ల నిర్మాణం కోసం టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు తమకు గిట్టుబాటు కాదని తప్పుకోగా, ఆఫీసర్లు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు.

కొన్నిచోట్ల పనులు షురూ చేయలే..

నారాయణపేట జిల్లాకు రెండు విడతల్లో 2,090 ఇండ్లు మంజూరయ్యాయి. నారాయణపేట మున్సిపాలిటీకి 400, మక్తల్​ మున్సిపాలిటీకి 500, కోస్గి పరిధిలో 300, మద్దూర్​కు 200, మరికల్​కు 61, ధన్వాడకు 40, మందిపల్లి, పస్పుల, కొండాపూర్, కిష్టాపూర్, హన్మాన్​పల్లి, చెర్లపల్లి, మడుగుమల్లయ్యతండా, గున్ముక్ల, తీలేర్, మద్వార్, పూసల్​పహాడ్, వెంకటాపూర్, రాకొండ గ్రామాలకు 275 ఇండ్లు కేటాయించారు. దామరగిద్ద మండలానికి 210, పేట మండలానికి 60 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో నారాయణపేట, మక్తల్, కోస్గి​ మున్సిపాలిటీల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినా, ఒక్క ఇల్లు కంప్లీట్​ కాలేదు. జిల్లా కేంద్రం సమీపంలోని ఎక్లాస్​పూర్​ రోడ్​లో సర్వే నెంబర్​ 711లో ఇండ్ల నిర్మాణానికి 2017లో మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్​ పనులు ప్రారంభించి కొన్ని స్లాబ్​ వరకు, మరికొన్ని పిల్లర్ల వరకు పూర్తి చేశారు. మక్తల్​లో బీసీ కాలనీ సమీపంలో స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించారు. 900 ఇండ్లకు టెండర్లు పిలవగా, 864 ఇండ్ల వర్క్స్​ ప్రారంభమయ్యాయి. కోస్గిలో పనులు ప్రారంభించలేదు. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. 

పేదల స్థలాలు తీసుకున్రు..

జిల్లా  కేంద్రంలోని 711 సర్వే నంబర్​లో గతంలో 170 మంది దళితులకు అందజేసిన ఇండ్ల స్థలాలను డబుల్​ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ స్థలం ఖాళీగా ఉంటే గృహలక్ష్మి స్కీం కింద రూ.3 లక్షలు వచ్చేవని అంటున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని
 వాపోతున్నారు.

ఎమ్మెల్యేలు ఏం చేస్తున్రు?

జిల్లాలో ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు కూడా పూర్తి చేయించలేని జిల్లా ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి. పట్టణంలో పేదల ఇండ్ల స్థలాలు తీసుకున్నారు. వారికి న్యాయం చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం డబుల్​  ఇండ్లు ఇవ్వకపోతే పేదలతో కలిసి ఉద్యమిస్తాం.

సత్యయాదవ్, బీజేపీ జిల్లా ఉపాద్యక్షుడు