- హాస్పిటల్స్, హాస్టల్స్ పై ఫుడ్‌సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్
- రెండు ఆస్పత్రుల నుంచి ల్యాబ్‌కు శాంపిల్స్
- రిపోర్టులు రాగానే నోటీసులిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పేదలకు పెద్దదిక్కుగా ఉన్న గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో పేషెంట్లు, వాళ్ల అటెండెంట్లకు ఏ మాత్రం క్వాలిటీ లేని ఫుడ్ఇస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు సుమారు 20 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 20న (మంగళవారం) గాంధీ, నిమ్స్ దవాఖానల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు.
గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పును వండుతుండడంతో పాటు దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిమ్స్ లోనూ ఇలాంటి పరిస్థితినే గమనించారు. పేషెంట్లు, అటెండెండ్లకు హైజెనిక్ ఫుడ్ ఇవ్వాల్సిన ఈ రెండు ఆస్పత్రుల క్యాంటిన్లలోనూ అధ్వాన పరిస్థితులు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు.
Also Read:-150 గజాల స్థలం కోసం భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి చంపేసిన భార్య!
ఇందుకు సంబంధించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు రాగానే ఒకటి, రెండు రోజుల్లో ఆ రెండు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, కొన్ని హాస్పిటల్స్ ప్రమాణాలు పాటిస్తున్నట్టు అధికారులు చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరుపుతున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.
ప్రభుత్వ హాస్టళ్లపైనా ఫోకస్..
స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ తో పాటు హాస్టల్స్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడంలేదని ఆఫీసర్లు గుర్తించారు. ఇప్పటికే చేసిన దాడుల్లో ప్రతి హాస్పిటల్, హాస్టల్లో ఏదో ఒక సమస్య ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా కిచెన్ లు ఏ మాత్రం పరిశుభ్రంగా ఉండడం లేదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పలు హాస్టళ్లకు నోటీసులు సైతం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు..
హాస్పిటల్స్, హాస్టల్స్ లో నాణ్యతలేని ఫుడ్ సర్వ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా diripmtg@gmail.com లేదా fssmutg@gmail.com కి మెయిల్ ద్వారా కానీ, 9100105795 నంబర్‌కు కాల్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అలాగే, ట్విట్టర్ ద్వారా @cfs_telanganaకు కంప్లైంట్చేయవచ్చన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 040–21111111 లేదా foodsafetywing.ghmc@gmail.comకు అలాగే, @afcghmc(ట్విట్టర్) కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.