వైరా, వెలుగు: కొణిజర్ల మండలం పెద మునగాల గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు క్వాలిటీగా లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ చీరలు మాకొద్దు.. సీఎంకు పేద ఆడ బిడ్డలంటే అంత అలుసా?, కేసీఆర్బిడ్డ, కుటుంబ సభ్యులు ఇలాంటి చీరలు కట్టుకుంటారా’ అని ప్రశ్నించారు. పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ పై మండిపడ్డారు.
మూడేండ్లుగా బతుకమ్మ చీరలను బొంతలు కుట్టించుకునేందుకు, తాళ్ల తయారీకి, నారుమళ్ల దగ్గర పందులు రాకుండా వాడుతున్నామని చెప్పారు. తక్కువ క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తే ఎలా కట్టుకోవాలని నిలదీశారు. ప్రభుత్వం ఇస్తుందేగానీ ఎవరూ కట్టుకోవడం లేదని తెలిపారు. పంపిణీ చేసిన చీరలను అక్కడే పడేసి వెళ్లిపోయారు. సర్పంచ్ మాట్లాడుతూ.. బతకమ్మ చీరలు తీసుకునేందుకు మహిళలు ఎవరూ ఇష్టపడడం లేదని చెప్పారు.