- గుడిసెలు వేసుడు.. ఆఫీసర్లు కూల్చుడు
- మానుకోటలో గుడిసెలు తొలగించడంతో మళ్లీ ఉద్రిక్తత
- పోలీసుల తీరుకు నిరసనగా పెట్రోల్ చల్లుకున్న యువకుడు
- పేదలను అరెస్టు చేసిన పోలీసులు
మహబూబాబాదాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ భూమిలో పేదల గుడిసెల పోరాటం బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 255/1 లో 30 ఎకరాల పరిధిలో పేదలు వేసుకున్న గుడిసెలను ఇటీవల తొలగించడంతో వాటి స్థానంలో మళ్లీ కొంతమంది మంగళవారం రాత్రి గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలిసిన రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ ఆఫీసర్లు తెల్లవారుజామున అక్కడికి చేరుకుని సదరు గుడిసెలను తొలగించడంతో పాటు, పేదలను అక్కడి నుంచి బయటకు పంపిస్తుండగా తోపులాట జరిగింది. మహబూబాబాద్ రూరల్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో భారీగా వచ్చిన పోలీస్ బలగాలను పేదలు తీవ్రంగా ప్రతిఘటించారు.
తూము వేణు అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి మీద చల్లుకోగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది గుడిసెలను తొలగిస్తుండగా జిన్న నర్సమ్మ అనే మహిళ కాలుకు గాయమైంది. మట్టాల సురేశ్ చేతికి దెబ్బతగిలింది. గాయపడ్డవారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పలువురిని డీసీఎంలలో స్టేషన్కు తరలించారు. తర్వాత సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మానియేల్ హెచ్చరించారు.
ప్రతీ సారి ఇదే..
కలెక్టరేట్ పక్కనే ఉన్న ప్రభుత్వ జాగలో సీపీఎం ఆధ్వర్యంలో దాదాపు 800 మంది పేదలు మూడు నెలల నుంచి ఐదు సార్లు గుడిసెలు వేసుకున్నారు. ప్రతీసారి వాటిని ఆఫీసర్లు ఎక్స్కవేటర్లు, డోజర్లతో నేలమట్టం చేశారు. గూడు కోసం వేసుకున్న తమ గుడిసెలను తరచుగా తొలగిస్తున్నారని ఆఫీసర్లు, ప్రభుత్వంపై పేదలు మండిపడ్తున్నారు.