తెలంగాణలో అధ్వానంగా ఘన వ్యర్థాల నిర్వహణ

తెలంగాణలో అధ్వానంగా ఘన వ్యర్థాల నిర్వహణ

తెలంగాణాలో ఘన వ్యర్థాల నిర్వహణ ఘనంగా లేదు. అధ్వానంగా ఉన్నది.  ‘చెత్తగా’ పరిగణించే ఘన వ్యర్థాల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.  సమస్య పట్టణాలకే పరిమితం కాలేదు.  గ్రామాలకూ పాకింది. హైదరాబాద్ వంటి  మహా నగరంలో ఇంకా పెద్ద తలనొప్పిగా మారింది.  

అన్ని రకాల వనరులు ఉన్న హైదరాబాద్ నగరంలో ఘన వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుగొనలేని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పట్టణాలు, గ్రామాలను ‘గాలికి’ వదలివేసింది.   అసలు అది సమస్యగానే భావించడం లేదు.  రాజకీయవేత్తలకు, అధికారులకు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్న చిత్తశుద్ధి  లేదు.  ఒక గ్రామం లేక నగరంలో పరిశుభ్రత అంటే ప్రతి ఇంటి నుంచి వచ్చే ‘చెత్తను’ సేకరించి శివార్లలో ఒక దగ్గర కుప్పగా పోయడం.  

ప్రైవేటు భూమి యజమానులు అభ్యంతరం పెడితే  చెరువుల పొంటి,  రోడ్ల పొంటి,  పోరంబోకు భూములలో పారబోయడం అలవాటుగా మారింది.  దేశమంతటా ఇదే పని.  ఈ పని సక్రమంగా చేసినవారికి అవార్డులు,  నజరానాలు.  ఇంటిలో ఉపయోగించనివి,  పనికిరానివి బయట పడేస్తే, అవన్నీ సేకరించి ఒకే దగ్గర కుప్ప పోయటం మున్సిపాలిటీ పనిగా మారింది. ఇందులో కూడా రకరకాల స్పందనలు.  ఒక్కో నగరంలో ఒక్కొక్కసారి పరిశుభ్రత పరిఢవిల్లుతుంది. ఆ తరువాత షరా మామూలే.

ఏ గ్రామం చూసినా, ఏ నగరం సందర్శించినా ‘చెత్త కుప్పలు’ ఆధునికతకు ఆయా ప్రాంతాల జీవనశైలికి, మారుతున్న సంస్కృతికి ప్రతీకగా మారాయి.  ఎటుచూసినా ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు చిందరవందరగా పడేయడం తప్పితే వాటి గురించి ఆలోచన పాలకులు చాలా తక్కువ.  ఇంకొకవైపు గత్యంతరం లేని స్థాయిలో వినియోగం, విసర్జన జరుగుతున్నది.  కష్టపడి సేకరించిన ‘చెత్త’  కుప్పలుగా మొదలయ్యి, గుట్టలుగా మారుతున్నాయి.  

చెత్త గుట్టల తయారు అయిన ప్రాంతంలో ఉన్నవారికి అవి నిత్యం నరకాన్ని చూపిస్తున్నాయి.  మంచి గాలి, నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. అనేక రకాల వ్యర్థాలు ఉండడం వలన ‘చెత్త’ నిత్యం కాలుతూనే ఉంటుంది.  గుట్టలుగా పోసిన ఘన వ్యర్థాలు గాలిలోకి వాయువులను,  భూమి మీదకు లేదా భూగర్భంలోకి వ్యర్థ జలాలను పంపిస్తుంటుంది.  

ఘన వ్యర్థాల కూర్పుమీద అనేక అధ్యయనాలు జరిగినాయి.  జరుగుతున్నాయి. అయితే ఈ అంచనాలకు శాస్త్రీయత లేదు.  ఘన వ్యర్థాల సుస్థిర నిర్వహణకు కావాల్సిన ప్రాథమిక సమాచారం 3 రకాలుగా ఉంటుంది. ఎంత చెత్త ఉత్పన్నం అవుతున్నది, చెత్తలో ఏమి ఉన్నది, తగిన సాంకేతిక సామర్థ్యం ఉన్నదా?  వీటిమీద సమాచారం ఉండడం, ఆ సమాచారం నిరంతరం సేకరించి విశ్లేషించడం కూడా నిర్వహణలో భాగమే.

హైదరాబాద్​ విస్తరణ

హైదరాబాద్ నగరం పెరుగుదల,  విస్తరణ గత 40 ఏండ్లలోనే జరిగింది.  మొదట్లో నగరం ఉత్పన్నం అవుతున్న చెత్త అంతా వనస్థలిపురం దగ్గర ఆటోనగర్ ప్రాంతంలో వేసేవారు. ఇది రక్షిత అటవీప్రాంతం అయిన మహావీర్ వనస్థలిపురం పార్క్ కు ఆనుకుని ఉండేది.  ఆ తరువాత,  గోల్కొండ పరిసరాలలో గంధంగూడలో మొదలుపెట్టారు.  మూడు కూడా స్థానిక ప్రజల ఒత్తిడి మేరకే ఆపేశారు. అప్పటికే, ఆ ప్రాంతంలో గాలి, నీరు తీవ్రంగా కలుషితం అయినాయి.  

ఆటోనగర్​లో  కొత్తగా  చెత్త  వేయకున్నా నిత్యం అక్కడ ప్లాస్టిక్​తో కూడిన ‘ఎరువు’ అమ్ముతున్నారు.  అందులో ఉన్న రసాయన అవశేషాలు గురించి పరీక్షలు చేసినట్టు లేదు.  తరువాత క్రమంగా జవహర్ నగర్ చెత్తకు  ఏకైక గమ్యంగా మారింది. ఇక్కడ మొదలు అయిన కుప్ప ఇప్పుడు పెద్ద కొండగా మారింది.  

స్థానికుల మీద అనేక రకాలుగా దీని ప్రభావం కనపడుతోంది.  నేషనల్ గ్రీన్  ట్రిబ్యునల్ లో వేసిన కేసు ఫలితంగా ఇంకా వేరేచోట్ల చెత్త కేంద్రాలను గుర్తించాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​కు ఆదేశాలు ఇచ్చికూడా ఏండ్లు అయినాయి.  హైదరాబాద్ నలుదిక్కుల ప్రాంతాలను గుర్తించిన జీహెచ్ఎంసీ  నత్తనడకన పనులు చేస్తున్నది.

చెత్తను ఎరువుగా మార్చాలి

రోజుకు దాదాపు  9 వేల టన్నుల చెత్త  జవహర్ నగర్ పంపించే బదులు, అందులో 60 శాతం వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఎరువుగా మారిస్తే  కోట్ల రూపాయలుఆదా అవుతాయి. ఆదాయం కూడా వస్తుంది.  ప్రతి ఇంటిలో విధిగా తడి చెత్తను ఎరువుగా మార్చుకోండి అనే నిబంధన తీసుకురావాలి. అప్పుడే కొండంత సమస్య ఒక గుట్ట స్థాయికి చేరుతుంది.

వ్యర్థాలతో ప్రమాదాలు

ఘన వ్యర్థాలలో అనేక రకాలు ఉన్నాయి. వాటి పరిమాణం, లక్షణాలు,  బాహ్య స్థితి వంటి అంశాలను  ముందర పెట్టుకుని  వర్గీకరణ చెయ్యాలి.  ఈ విషయంగానే  ఎప్పుడో ఆసుపత్రి వ్యర్థాలను వేరు చేశారు. ఇండ్ల నుంచి పారవేసే ఘన వ్యర్థాలలో  తడి, పొడి చెత్త మాత్రమే కాకుండా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి.  

చాలామందికి ఏవి ప్రమాదకరమైనవో కూడా తెలియదు.  వాటిని ప్రభుత్వం ఏనాడూ నోటిఫై చేయలేదు. బ్యాటరీలు, పెయింట్లు, రసాయనాల సీసాలు,  డబ్బాలు, వగైరా  చాలా  ప్రమాదకరమైనవి.  చెత్తగుట్టలలో  పొగ,  నిప్పు పుట్టడానికి ఈ ప్రమాదకర వ్యర్థాలే  కారణం.  పరిశ్రమల నుంచే కాక  ఆఫీసులు, ఇండ్ల నుంచి కూడా ఇవి బయట పడేస్తున్నారు. 

ఉప ఉత్పత్తులను ఉపయోగంలోకి తేవాలి

ఘన వ్యర్థాలలో  ఉప ఉత్పత్తులు ఉంటాయి.  ప్రాథమిక ఉత్పత్తి కానిది ఉప ఉత్పత్తిగా పరిగణిస్తారు.  అనేక ఉత్పత్తి కేంద్రాలు తమ దగ్గర ఉత్పన్నమయ్యే ఉప ఉత్పత్తులను వ్యర్థాలుగా పడేస్తారు. దుస్తుల పరిశ్రమల నుంచి చీలికలు,  పీలిక  గుడ్డలు బయట పడేస్తారు.  వీటిని ఉప ఉత్పత్తులుగా పరిగణించి వాటికి తగిన ఉపయోగం కనుగొంటే  ఘన వ్యర్థాలు తగ్గుతాయి.  భవన నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలను పొడిగా మార్చే యంత్రాలు వచ్చాయి.  హైదరాబాదులో ఒక కేంద్రం కూడా ఏర్పాటు అయ్యింది.  ప్రతి ఉప ఉత్పత్తిని గుర్తించి వాటిని ఉపయోగంలోకి తెచ్చే ప్రణాళిక తయారుచేసే బాధ్యత హైదరాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్ చేపట్టాలి. 

గుట్టలుగా  చెత్తకుప్పలు

హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు గ్రామాలలో  హైదరాబాద్ నగరవాసులు ఉత్పత్తి చేసే ‘చెత్తను’ పారవేయడం, కుప్పలు పెంచడం, గుట్టలుగా పోయడం వారి ఆయా గ్రామస్తుల హక్కులకు భంగం కలిగించడమే. ఇది ఒక రకమైన సాంఘిక వివక్ష.  ఉన్నత వర్గాలు నివసించే  ప్రాంతాలలో ‘చెత్త’ కుప్పలు ఉండవు.  

ఎకరా  కోట్లల్లో పలికే  కోకాపేట్​లో  చెత్త కేంద్రాల ఏర్పాటు ఆలోచన కూడా చేయరు. మరి ఆయా ఇండ్లలో నుంచి వచ్చే ‘చెత్తను’ ఇతరులు ఎందుకు భరించాలి?  కాలుష్యం చేసేవారి మీద బాధ్యత పెడితే  ‘చెత్త’  పరిమాణం తగ్గుతుంది.  కాలుష్యం చేసేవారి మీద ఆర్థిక భారం మోపితే కాలుష్యం తగ్గినట్లు,  ‘చెత్త’గా వ్యర్థాలను  పడేసేవారి మీద కూడా అటువంటి ఆర్థిక భారం మోపే వ్యవస్థ రావాలి.  అది లేకనే  అభివృద్ధి  చెందిన దేశాల  (ప్రత్యేకంగా అమెరికా దేశం) నుంచి  ‘చెత్త నింపుకుని ఓడలు పేద దేశాలలో పడేయడం,  ధనవంతుల  చెత్తను  పేదల నివాస ప్రాంతాలకు చేరడం వంటివి ఈ కోవలోనివే. 

జీరో వేస్ట్ ​లక్ష్యంగా పెట్టుకోవాలి

ఉప ఉత్పత్తులు విస్తృత శ్రేణి  వ్యాపార రంగాల నుంచి రావచ్చు.  అవి చాలా భిన్నమైన పర్యావరణ ప్రభావాలను కలుగజేస్తాయి.  పర్యావరణానికి నష్టం తగ్గించడానికి, వ్యాపారంలో అనవసరమైన ఖర్చులను నివారించడానికి ఉప ఉత్పత్తులను సరిగ్గా వర్గీకరించడం, తిరిగి ఒక ఉపయోగంలోకి  తేవడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులు లేదా పదార్థాలు వ్యర్థాలుగా కాకుండా  ఒక ఉత్పత్తిగా లేదా ద్వితీయ ముడిపదార్థంగా మారినప్పుడు దానికి తగిన చట్టపర గుర్తింపు ఇవ్వడం ముఖ్యం. 

ప్రతి పౌరుడు ఆలోచనతో, అవగాహనతో, పర్యావరణ స్పృహతో పాల్గొనేలా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ నిర్మాణం చెయ్యాలి. అన్ని స్థాయిలలో జీరో వేస్ట్​ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యసాధనకు తగిన నిబంధనలు తీసుకురావాలి.  ప్రభుత్వాలు కూడా ఘన వ్యర్థాల నియంత్రణకు నడుము బిగించాలి. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఉత్పన్నమవుతున్న ఘన వ్యర్థాలను బట్టి ఫీజు వసూలు చెయ్యాలి. మురుగు నీటికి ప్రతి లీటర్ బట్టి,  చెత్త ప్రతి కిలోకి ఇంత అని నిర్ధారిస్తే జీరో వేస్ట్ దిశగా పయనించడం సులువు అవుతుంది.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-