తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నంగా తయారైంది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం పట్ల చూపిస్తున్న వివక్షనే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆనాడు రాష్ట్ర సాధనలో విద్యార్థులు, మేధావులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొని ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం సర్కారు విద్యాసంస్థలతోపాటు, ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు, వందల సంఖ్యలో డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. దీంతో ఆయా కాలేజీల్లో పనిచేసే వేలాది మంది సిబ్బంది రోడ్డునపడ్డారు. ఒక్కో జిల్లా కేంద్రంలో గతంలో పదికిపైగా కాలేజీలుంటే ఇప్పుడు 2,3 మాత్రమే ఉన్నాయి. నిరుద్యోగ యువత ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు కాలేజీలపై సైతం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. నిరుద్యోగ యువత నడుపుతున్న ప్రైవేటు కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ కాలేజీలకు కేసీఆర్ ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నది.
మూడేండ్లలో రూ.5వేల కోట్ల బకాయిలు
ప్రైవేటు కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకూ సకాలంలో స్కాలర్ షిప్ లు, ట్యూషన్ ఫీజులు ప్రభుత్వం చెల్లించడం లేదు. మూడేండ్లలో దాదాపు రూ.5 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. దాదాపు రెండున్నర ఏండ్లుగా స్కాలర్ షిప్ బకాయిలు రిలీజ్ చేయడం లేదు. విద్యాసంవత్సరం పూర్తయిన రెండు, మూడేండ్లు అవుతున్నా.. ట్యూషన్ ఫీజులు ఇవ్వడం లేదు. గతేడాది డిసెంబర్ లో టోకెన్లు ఇచ్చారు కానీ ఇప్పటికీ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు.
ఈ సంవత్సరం జూన్ 22న రూ.1,550 కోట్లకు బీఆర్ఓ రిలీజ్ చేశారు. అయినా, ఇప్పటికీ ఆ డబ్బులు రాలేదు. సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం 12.50 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది. స్టూడెంట్లకు ఏటా రూ.2,350 కోట్లు మాత్రమే అవసరం. వాటినీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ మాత్రం డబ్బులు కూడా విద్యకు ఇవ్వలేని ప్రభుత్వానికి పేద విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.
ఉన్నతవిద్యకు పేద విద్యార్థులు దూరం
ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు అప్పులు తీసుకోని కాలేజీలను నడుపుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ఏటా కేవలం రూ.1,740 మాత్రమే ఇస్తోంది. జీవో 114 ప్రకారం ప్రతి సంవత్సరం 10శాతం పెంచాల్సి ఉంది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పెంచలేదు. కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు రూ.30వేల నుంచి రూ.3లక్షల వరకూ పెరిగాయి. అంటే ఈ బీఆర్ఎస్ సర్కారు ఎవరి పక్షమో అర్థం చేసుకోవాలి.
తెలంగాణ ఉద్యమంలో తమ కాలేజీల్లో చదివే విద్యార్థులతోపాటు మేనేజ్మెంట్లు చురుకుగా పాల్గొనడమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అటు ఉద్యోగాలు రాక, ఇటు కాలేజీల మూతతో ఉన్న ప్రైవేటు ఉద్యోగం కోల్పోయి రోడ్లమీదికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు వచ్చాయి. ప్రస్తుత పాలకులు ర్యాంకుల ఆధారంగా స్కాలర్ షిప్ ఇస్తూ, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు విద్యార్థులు, యువత ఆలోచించి మరోసారి మోసపోకుండా ఓటు హక్కుతో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చే కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే మనందరి కష్టాలు తీరతాయి.
‑ గౌరీసతీష్, టీపీసీసీ అధికార ప్రతినిధి