దండు కడుదాం.. దండోరా మోగిద్దాం

దండు కడుదాం.. దండోరా మోగిద్దాం

తెలంగాణ అంటే ఉద్యమ బావుటా.. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ.. తెలంగాణ గడ్డ ఆత్మ గౌరవ ప్రతీక.. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం పోరాడిన నేల మనది. బాంఛన్ దొర కాల్మొ క్త నుంచి బడిసెలందుకొని దొరలను తరిమి గుండెల మీద కాలు పెట్టి కదనరంగంలో దుంకిన యువ రక్తం మనది. ఆత్మ గౌరవం అంటే భూమి, ఆత్మ గౌరవం అంటే సొంత ఇల్లు, ఆత్మ గౌరవం అంటే విద్య, ఆత్మ గౌరవం అంటే ఉద్యోగం, ఆత్మ గౌరవం అంటే తన కాళ్ల మీద తాను నిలబడి బతకడం, ఆత్మ గౌరవం అంటే రాజ్యాధికారం. మరి తెలంగాణలో బడుగులకు, బలహీనులకు, దళితులకు, గిరిజనులకు ఆత్మ గౌరవం దక్కుతున్నదా? మలివిడత తెలంగాణ పోరాటంలో ప్రధాన భూమిక పోషించింది ఆత్మ గౌరవ నినాదమే. ఆత్మ గౌరవ జెండాను పట్టుకొనే కదా యువత అంతా రోడ్లమీదికొచ్చి ఉద్యమించింది. చిన్న చిన్న కులాలకు చెందిన వాళ్లు మేము సైతం అంటూ చేతిలో జెండా, జబ్బలో సంచి వేసుకొని, కడుపు కట్టుకొని మరీ తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఆఖరికి ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక దళిత, ఆదివాసీలకు టీఆర్​ఎస్​ సర్కారు విద్య, వైద్యం, ఉద్యోగం, స్వయం ఉపాధి, భూమి, భద్రత లేకుండా చేసి ఆఖరికి ఆత్మ గౌరవాన్ని కూడా కాలరాసింది.


ఏడేండ్ల కేసీఆర్ పాలనలో దళిత, బహుజన బిడ్డలకు దక్కిన ఆత్మ గౌరవం ఏమిటి? కేసీఆర్ ఉద్యమ నేతనని చెప్పుకుంటూ తెలంగాణలో దళిత కుటుంబాలకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని, ఏడాది వరకు వ్యవసాయ వ్యయం భరిస్తానని, రైతు కూలీలను రైతులుగా చేసి ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తానని అన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తా అన్నడు. ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అందిస్తానన్నడు. ఆదివాసీలకు, గిరిజనులకు, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచి విద్య ఉద్యోగాల్లో వారి పరిధి పెంచుతా అన్నడు. కానీ.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పచ్చి మోసాలుగా మిగిలిపోయాయి. 

కాంగ్రెస్​ కృషి ఎన్నటికీ మరువలేనిది
కాంగ్రెస్ పాలనలో 70 ఏండ్ల కిందట్నే దళిత, గిరిజన, బహుజన బిడ్డలకు ఆత్మ గౌరవం పెంపొందేలా పథకాలు రూపకల్పన చేశారు. దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ.. అంబేద్కర్​ను  రాజ్యంగ నిర్మాణంలోనే రచనా కమిటీ చైర్మన్​గా నియమించి దళితులకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేశారు. దేశమంతా అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగు స్థానం ఉండేలా అవకాశాలు కల్పించారు. నేడు అనేక ఉన్నత ఉద్యోగాల్లో, రాజకీయాల్లో దళిత, గిరిజన బిడ్డలు అభివృద్ధి చెందారంటే, అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే అందుకు కాంగ్రెస్ పాలకులు చేసిన కృషి ఫలితమే కదా. ఇందిరమ్మ, పీవీ నర్సింహారావు దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి లక్షల మంది దళిత బిడ్డలకు భూములు ఇచ్చి, 20 సూత్రాల పథకాలు అమలు చేసి లక్షలాది మంది దళిత, గిరిజన బిడ్డలను రైతులుగా చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి ఇండ్లు నిర్మించి ఇచ్చి వారికి నీడనిచ్చింది. ఇండ్లు, భూమి, ఉద్యోగాలు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం, స్వయం ఉపాధి రంగాల్లో అభివృద్ధి.. ఇలా దళిత, ఆదివాసీ, బహుజన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పాలకులు చేసిన కృషిని ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. మరి కేసిఆర్ ఏమి చేశారు? 

అడుగడుగునా కేసీఆర్​ దగా
తెలంగాణలో సమగ్ర సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలకు సెంట్ భూమి కూడా లేదు. మరో 6 లక్షల కుటుంబాలకు ఎంతో కొంత  భూమి ఉంది. ఈ తొమ్మిది లక్షల కుటుంబాలను ఆత్మ గౌరవంతో బతికేలా చేయాలంటే వారికి కనీసం కొంత భూమి ప్రభుత్వం కొని ఇవ్వాలి. కానీ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆఖరికి మూడు ఎకరాలు కాదు కదా ఒక ఎకరమన్నా ఎందుకు ఇవ్వలేదు? అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందికి ఇండ్లు ఇచ్చారన్న సమాచారం ఎక్కడా లేదు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, నాలుగు నెలల్లో అమలు చేస్తామని 2014 ఏప్రిల్ లో షాద్​నగర్​లో జరిగిన సభలో స్వయంగా కేసీఆర్  ప్రకటించారు. ఏడేండ్లయినా ఎందుకు అమలుకాలేదు. ఇప్పటి వరకు బిశ్వాల్ కమిటీ గుర్తించిన 1.97 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసి ఉంటే వేలాది మంది దళిత, ఆదివాసీ యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. మరి కేసీఆర్  ఎందుకు ఆ పనులు చేయడం లేదు? ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. దళిత బంధు అనే కల్లబొల్లి  మాటలు ఎన్నికల కోసమే కదా? గతంలో చేస్తామన్న ఒక్క పని కూడా చేయని కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు మభ్యపెడుతామంటే ఎలా భరిద్దాం. దళితులని అడుగడుగునా కేసీఆర్​ దగా  చేశారు. కాంగ్రెస్ హయాంలో దామోదర నరసింహ నేతృత్వంలో సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తే.. టీఆర్​ఎస్​ సర్కారు ఆ చట్టాన్ని తుంగలో తొక్కి క్యారీ ఫార్వర్డ్ అని దొంగ మెలికపెట్టి లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా కమీషన్లు ఇచ్చే కాళేశ్వరానికి మళ్లించింది. కాళేశ్వరం కింద దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా లేదు. అటు నిధులు దళితుల కోసం ఖర్చు కాలేదు.. ఇటు కాళేశ్వరం వల్ల దళితులకు ప్రయోజనం జరగడం లేదు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే.. వీరిలో చాలా మంది దళితులే. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు. 9 లక్షల 15 వేల 553 మంది స్వయం ఉపాధి కోసం  ఎస్సీ, ఎస్టీ  ఫైనాన్స్ కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్షా ఐదు వేల 957 మందికి మాత్రమే నిధులు కేటాయించి మిగిలిన వారి నోట్లో మన్నుకొట్టారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 6 వేల 4 వందల 99 కోట్ల రూపాయలు గత ఏడేండ్లుగా కేటాయిస్తే.. కేవలం 34.5 శాతం అంటే రూ.2,246 కోట్లు ఖర్చు చేశారు. ఇది దగా కాదా.. మోసం కాదా.. ఇప్పుడు దళిత బంధు అంటే నమ్మాలా?

దళిత రాబందు.. కేసీఆర్
రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సరిగ్గా అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసే కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండాలని చట్టం చెబుతోంది. దీనిపై నెలకోసారి రివ్యూ చేయాల్సి ఉంటుంది. అప్పుడే చట్టం కఠినంగా అమలు జరిగే ఆస్కారం ఉంటుంది. కానీ కేసీఆర్ బాధ్యత తీసుకోలేదు. దీని ఆంతర్యం ఏమిటి? కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఏడేండ్లుగా దళితులపై దాడులు పెరుగుతున్నాయి. పేదల విద్యని టీఆర్ఎస్​ సర్కార్​ సర్వనాశనం చేసింది. ప్రైవేట్ స్కూళ్ల లో దోపిడీ అరికట్టలేకపోయింది. దళితులు, ఆదివాసీలు, బీసీలు చదువుకునే యునివర్సిటీలను నాశనం చేసింది. వైస్ చాన్సలర్లను నియమించడంలో ఏండ్ల తరబడి ఆలస్యం చేసింది. ఇంకా సగంపైగా ఫ్యాకల్టీ పదవులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకులు లేని విద్యాలయాలు నాణ్యమైన విద్య ఎలా అందిస్తాయి? నాణ్యమైన విద్య లేకపొతే దళితులు, ఆదివాసీలు, బీసీలు ఎలా చదువుకుంటారు? 124 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ అమలు చేయకుండా దళితులు, పేదవారిని వైద్యానికి దూరం చేశారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు  భర్తీ చేసివుంటే దళితులు, గిరిజనులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 30 వేల ఉద్యోగాలు వచ్చేవి. కానీ భర్తీలు చేయకుండా పేదవారిని ఇంకా పేదరికంలోకి నెట్టారు. విద్య లేదు..  వైద్యం లేదు.. ఉపాధి లేదు.. ఆస్తి లేదు.. ఆత్మ గౌరవం లేదు.. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఎలా అవుతుంది? కేసీఆర్​ ముమ్మాటికీ దళిత రాబందే. ఇవాల్టికి కూడా దళిత బిడ్డలను మాన్యువల్  స్కావెంజింగ్ కు వాడుకొని, వారి చావులకు టీఆర్ఎస్ సర్కార్  కారణం అవుతోంది. హుజూరాబాద్ లో ఉన్న 52 వేల దళిత ఓట్లు కీలకమైనవి. ఉప ఎన్నికలో వాటిని కబళించడానికే దళితబంధు అనే నాటకాన్ని కేసీఆర్​ మొదలుపెట్టిండు. రాష్ట్రంలో మండలాల వారీగా, జిల్లాల వారీగా దళిత బంధు అర్హుల వివరాలు ప్రకటించాలి. ఈ పథకానికి సంబధించిన పూర్తి విధివిధానాలు తయారుచేసి ఎప్పటిలోగా అర్హులందరికీ రూ.10 లక్షలు ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. ఈ పథకానికి ఇంకా ప్రభుత్వ జీవో లేదు. ముందు జీవో విడుదల చేయాలి.

దళితులకు ఇవ్వడానికి భూములెందుకు లేవ్?
దళితులు ఆత్మ గౌరవంతో బతకాలంటే ఆస్తులు కావాలి. భూమి కావాలి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్.. 9 లక్షల మంది అర్హులు ఉంటే కేవలం 6,600 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అడిగితే భూములు లేవని చెప్తున్నారు. కానీ ఫార్మాసిటీ కోసం 25 వేల ఎకరాల భూమిని పేదవారి దగ్గరి నుంచి లాకున్నారు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే ప్రణాళికలో ఉన్నారు. ఫార్మాసిటీకి, డబ్బుల కోసం అమ్ముకోవడానికి, ప్రభుత్వ పెద్దలు ఫాం హౌస్ లు కట్టుకోవడానికి వేల ఎకరాల భూములు ఉంటాయి.. కానీ దళితులకు ఇవ్వడానికి భూములు ఉండవా? భూమిస్తామని దళితులకు హామీ ఇచ్చి కేసీఆర్ దగా చేశారు. భూమి ఇవ్వకపోగా రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రాజెక్టుల పేరుతో కనీస నష్టపరిహారం చెల్లించకుండా గుంజుకున్నారు. దళితులకు ఆస్తులు లేకుండా వారి ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టారు. దళిత హక్కులని కేసీఆర్​ కాలరాస్తుంటే టీఆర్ఎస్​లోని దళిత, ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన ముందు కుక్కిన పేనులా పడిఉంటూ.. ప్రశ్నించే ప్రజా సంఘాలపై , ప్రతిపక్ష పార్టీలపై తెగ రెచ్చిపోయి అరుస్తున్నారు. ఇలా ఎంతకాలం ఈ దగా పాలనలో ఆత్మ గౌరవం చంపుకొని బతుకుదాం.. ఇకనైనా దండు కడుదాం.. దండోరా వేద్దాం.. ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం. ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోతవ్సం సందర్భంగా ఇంద్రవెల్లిలో పోరు మొదలు పెడుదాం. పొలికేక పెడదాం. సెప్టెంబర్ 17 వరకు దాదాపు 40 రోజుల పాటు ఊరురా తిరుగుదాం.. దండోరా వేద్దాం.. ఈ నిరంకుశ పాలనపై యుద్ధం చేద్దాం.

ఆదివాసీలకు శాపంగా మారిన కేసీఆర్ 
గరిష్ట భూపరిమితి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది పేదలకు భూమి పంచి వారికి ఆస్తి ఇచ్చి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. కానీ పేదవారికి ఇచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ సర్కార్ హరిత హారం, హరిత వనం , వైకుంఠ ధామాలు, కలెక్టర్ కార్యాలయాలు, పరిశ్రమల పేరు మీద నష్టపరిహారం కూడా చెల్లించకుండా లాక్కుకున్నది. పోడు వ్యవసాయం చేసుకొని బతుకుతున్న అటవీ ప్రాంతాల ఆదివాసీల భూములను కూడా దౌర్జన్యంగా గుంజుకున్నది. జల్, ​జంగల్, జమీన్​ ఉద్యమాన్ని గౌరవిస్తూ పోడు భూముల వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూముల హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద ఆదివాసీలకే భూమి చెందేలా మూడు లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చింది. 2014 నాటికి ఇంకా 13 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. కానీ కేసీఆర్ సర్కార్ ఏడేండ్లుగా హక్కు పత్రాలు ఇవ్వకుండా వారికి అన్యాయం చేస్తూ ఆఖరికి పోడు చేసుకుంటున్న రైతులకు రైతు బంధును వర్తింపచేయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలకు కూడా మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. కానీ ఒక్కరికీ ఇవ్వలేదు. కనీసం జీవో కూడా విడుదల చేయలేదు. అధికారులను నియమించకుండా ఇంటిగ్రేటడ్  ట్రైబల్ డెవలప్ మెంట్ అథారిటీ(ఐటీడీఏ )లను నిర్వీర్యం చేశారు. దాదాపు 43 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. ఎందుకు భర్తీ చేయడం లేదు? కేసీఆర్ చేసిన ద్రోహాలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి గడ్డ నుంచి స్ఫూర్తి రగిలించడానికి.. కాంగ్రెస్​ 'చలో ఇంద్రవెల్లి' సభకు సిద్ధమవుతున్నది.

- డాకర్ట్​ దాసోజు శ్రావణ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి