- మాజీ మంత్రి పువ్వాడ అనుచరులపై చర్యలు తీసుకోవాలి
- ఖమ్మంలో బాధితుల ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని పలు ఏరియాలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన 180 మంది వద్ద రెండేండ్ల కింద రూ.మూడున్నర కోట్లు వసూలు చేసి మోసం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అనుచరులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాపర్తి నగర్ కు చెందిన 27 మంది బాధితులు మంగళవారం టౌన్ ఏసీపీని కలిసేందుకు వచ్చారు.
అక్కడ ఏసీపీ లేకపోవడంతో ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ స్కీమ్స్ ఇప్పిస్తామని చెప్పి నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో మంజూరు పత్రాలతో పువ్వాడ అనుచరులు మోసం చేశారని ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులను ఇప్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాధితులు హనుమంత్, జ్యోతి, గౌతమి, ఉమ, రేణుక, రాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.