
- మత పెద్దల ఆధ్వర్యంలో రోమ్‌లోని సెయింట్ మేరీ బాసిలికాలో ఖననం
- ప్రెసిడెంట్ ముర్ము సహా 164 దేశాల నుంచి హాజరైన నాయకులు
- వాటికన్ సిటీకి 2.5 లక్షల మందికిపైగా తరలివచ్చి నివాళులు
వాటికన్ సిటీ: క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం వాటికన్ సిటీలో నిరాడంబరంగా ముగిశాయి. తుది వీడ్కోలు పలికేందుకు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు లక్షలాదిమంది తరలివచ్చారు. మన దేశం నుంచి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సహా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ యువరాజు విలియం, స్పెయిన్ రాజకుటుంబీకులు, యూఎన్ చీఫ్, యూరోపియన్ దేశాల అధినేతలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 164 దేశాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. పోప్‌కు నివాళి అర్పించారు. 2.5లక్షల మందికిపైగా ప్రజలు పోప్‌ను కడసారి చూసేందుకు తరలివచ్చారు.
రోమ్ వీధులగుండా అంతిమయాత్ర..
శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు వాటికన్ సిటీలోని పీటర్ స్క్వేర్ నుంచి పోప్ అంతిమయాత్ర ప్రారంభమైంది. పోప్ భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను ఓపెన్‌టాప్ కారులో ఉంచి రోమ్ వీధులగుండా తీసుకెళ్లారు. ఈ వెహికల్ 2015లో ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా ఆయన ఉపయోగించినదే. అంతిమయాత్రను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా నిలబడిన వేలాది మంది ప్రజలు తెల్లగులాబీలు పట్టుకుని పోప్‌కు నివాళి అర్పించారు. సంపన్న సంప్రదాయ విధానాలను కాదని, నిరాడంబరంగా, సాధారణ రీతిలో తనకు అంత్యక్రియలు నిర్వహించాలన్న పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు మతపెద్దలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాటికన్ సిటీలోని పీటర్ బాసిలికాలో కాకుండా రోమ్ నగరంలోని సెయింట్ మేరీ బాసిలికాలో పోప్ భౌతికకాయాన్ని సమాధి చేశారు.