భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఓలీ పోప్ అసాధారణ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ను రేస్ లో ఉంచాడు. సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడో రోజు చివరి సెషన్ లో భాగంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు పట్టుదల చూపించడంతో 5 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. పోప్ (120), ఫోక్స్(34) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు అజేయంగా 100 పరుగులు జోడించడం విశేషం.
లంచ్ తర్వాత ఇంగ్లాండ్.. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించింది. భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఎలాంటి చిన్న అవకాశం ఇవ్వకుండా పోప్, ఫోక్స్ టీమిండియా బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 85 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఇదే జోరును ప్రదర్శించి 100 నుంచి 150 పరుగులు అదనంగా జోడిస్తే భారత్ కు ఛాలెంజ్ తప్పదు. భారత పిచ్ లపై చివరి రెండు రోజులు స్పిన్ ఎలా తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో భారత్ చక చక వికెట్లు తీసి వీలైనంత త్వరగా మ్యాచ్ ముగించాలని చూస్తుంది.