యాదాద్రి భువనగిరి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖంగా లేరని ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ కరువైందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే మహిళలకు భద్రత లభిస్తుందన్నారు.
నరేంద్ర మోడీ పాలన దేశానికి శ్రీరామ రక్షణగా నిలిచిందని జీవితా రాజశేఖర్ అన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దేశాన్ని కాపాడే ఒకే ఒక్క నాయకుడు మోడీ అని, అందుకే తాను మొదటి నుంచి బీజేపీకి సపోర్టు చేస్తున్నానని తెలిపారు. పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా చేస్తానని, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించినా చేస్తానని తెలిపారు.