నర్సన్నకు పైసలే పైసలు..ఏడాది ఆదాయం రూ. 232.77 కోట్లు

నర్సన్నకు పైసలే పైసలు..ఏడాది ఆదాయం రూ. 232.77 కోట్లు
  • యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు
  • గత ఏడాది కంటే రూ. 33.81 కోట్లు అదనం

యాదాద్రి, వెలుగు: యాదగిరి నర్సన్న ఇన్​కం భారీగా పెరిగింది. గతంలో కంటే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆదాయం కూడా ఆ మేరకు పెరుగుతోంది. స్వామి వారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో ఆర్టీసీ బస్సులు సైతం కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి పవర్​పుల్​ దేవుడని నమ్మకం. కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఈ టెంపుల్​కు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.

పండుగలు, పెండ్లిండ్ల​ సమయాల్లో తప్ప మామూలు రోజుల్లో మహిళలు ఆలయానికి తక్కువగా వచ్చేవారు. అయితే గత ఏడాది డిసెంబర్​ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫీ జర్నీ సౌకర్యం కల్పించడంతో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరింగింది.

భక్తుల సంఖ్య డబుల్..
గతేడాది వరకు యాదాద్రి నర్సన్న దర్శనం కోసం మామూలు రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది వచ్చే వారు. అదే శని, ఆదివారాలతో పాటు పండుగ​రోజుల్లో ఆ సంఖ్య 30 వేలకు పైగా ఉండేది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి భక్తులు మరింతగా వస్తుండడం పరిపాటి. అయితే 

గతేడాది డిసెంబర్​ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించిన కారణంగా మామూలు రోజుల్లోనే ఫెస్టివల్​ స్థాయిలో భక్తులు వస్తున్నారు. వీరిలో మహిళలే సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉంటోంది. సెలవు దినాల్లో 50 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఎక్కువ సమయం పడుతోంది. యాదాద్రి జిల్లా మీదుగా వెళ్లే ఏ బస్సు చూసినా నుదుటిపై మూడు నామాలు కలిగిన ప్రయాణికులే కన్పిస్తున్నారు. 

సౌకర్యాలు మెరుగు..
భక్తుల తాకిడి పెరగడంతో కొండపై సౌకర్యాలు మెరుగుపరిచారు. కొండపై భక్తులు నిద్రించేందుకు డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. కొండపై పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానం చేసే అవకాశం కూడా కల్పించారు. కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కొండపైకి ఆటోలను పునరుద్దరించారు. వృద్దులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్​ సౌకర్యం కల్పించడంతో పాటు వీల్​ చెయిర్​ ఏర్పాటు చేశారు. 

భారీగా పెరిగిన ఇన్​కం..
భక్తుల తాకిడి కారణంగా యాదాద్రి నర్సన్న ఇన్​కం గతంలో కంటే భారీగా పెరిగింది. డిసెంబర్​ 2022 నుంచి నవంబర్​ 2023 వరకూ స్వామి వారి ఏడాది ఇన్​కం అన్ని సేవలు కలిపి రూ.198,96,48,413 వచ్చింది. డిసెంబర్​ 2023 నుంచి నవంబర్​ 2024 వరకూ స్వామి వారికి రూ.232,77,95,796 ఇన్​కం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.33,81,47,383 అదనంగా వచ్చింది. 

భక్తులకు సౌలతులు కల్పిస్తున్నం
స్వామి వారిపై విశ్వాసంతో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌలతులు కల్పిస్తున్నాం. కొండపై పుణ్య స్నానాలకు అవకాశం కల్పించాం. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆదాయం కూడా పెరుగుతోంది.


భాస్కర్​రావు, ఈవో, యాదగిరిగుట్ట