సింగర్ కల్పన అప్డేట్ : రెండ్రోజులు ఉలుకూపలుకూ లేకుండా ఉండటానికి కారణం తెలిసింది !

సింగర్ కల్పన అప్డేట్ : రెండ్రోజులు ఉలుకూపలుకూ లేకుండా ఉండటానికి కారణం తెలిసింది !
  • నిద్ర మాత్రలు మింగినట్టు అనుమానం
  • ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

కూకట్​పల్లి, వెలుగు: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. నిజాంపేట రోడ్​లోని విల్లాలో నివాసం ఉంటున్న కల్పన రెండు రోజులుగా బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. లోపల బెడ్ రూంలో అచేతనంగా పడి ఉన్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పనను ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిద్ర మాత్రలు ఓవర్ డోస్ కారణంగానే కల్పన స్పృహ కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. కల్పనకు రోజూ నిద్రమాత్రలు వాడే అలవాటు ఉందని ఆమె భర్త ప్రభాకర్ పోలీసులకు తెలిపారు. రెండు రోజులుగా తాను చెన్నైలో ఉన్నానని, నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అయిందని కల్పన ఫోన్ చేసి చెప్పిందని వివరించారు. 

దీంతో తాను చుట్టుపక్కల వాళ్లకి ఫోన్ చేసి సాయం అర్థించినట్లు తెలిపారు. కాగా, భర్తతో విడాకులు తీసుకున్న సింగర్ కల్పన బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ప్రభాకర్ ను రెండో పెళ్లి చేసుకుంది. చెన్నైలో డెంటల్ సంబంధిత పార్ట్స్​ బిజినెస్ చేస్తుంటారు. ప్రభాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలేవైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కల్పన కుటుంబసభ్యులతో పాటు సింగర్లు సునీత, గీతామాధురి, శ్రీరామ్​ దవాఖానకు చేరుకుని కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.