చైనాలో జనాభా సంక్షోభం.. మూడేండ్లలో 14 లక్షలు తగ్గి రూ.140 కోట్లకు పాపులేషన్​

  • తగ్గుతున్న యువత..పెరుగుతున్న వృద్ధులు
  • జిన్​పింగ్​ సర్కారును కలవరపెడుతున్న జనాభా క్షీణత
  • జపాన్​, సౌత్​కొరియా, ఇటలీనీ వేధిస్తున్న సమస్య

బీజింగ్: జనాభా వేగంగా తగ్గడంతోపాటు అధిక మంది వృద్ధాప్యానికి చేరుకోవడంతో ప్రపంచంలోని చాలా దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా చైనా జనాభాలో భారీ క్షీణత కనిపించింది. వరుసగా మూడో సంవత్సరం కూడా తమ దేశ జనాభా తగ్గినట్టు  డ్రాగన్​కంట్రీ శుక్రవారం వెల్లడించింది. 2024 చివరి నాటికి దేశ జనాభా 1,408 బిలియన్ల (దాదాపు 140.8 కోట్లు) వద్ద ఉన్నదని, మూడేండ్లలో 14 లక్షలు తగ్గినట్టు పేర్కొన్నది. ఈ ఏడాది ఆ దేశంలో జననాల రేటు కాస్త పెరిగినా.. జనాభా పెరుగుదలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కాగా, చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతుండగా.. పని చేసే యువ జనాభా సంఖ్య తగ్గుతూ రావడం జిన్​పింగ్​ సర్కారును ఆందోళనకు గురిచేస్తున్నది.

చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి
చైనాతోసహా ఆసియా, తూర్పు యూరప్‌‌‌‌ దేశాల్లోనూ జనాభా వేగంగా తగ్గుతున్నది. జపాన్​లో గత 15 ఏండ్లుగా జనాభా రేటు పడిపోతున్నది.  2021 నుంచి సౌత్​ కొరియాలో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల కనిపిస్తున్నది. ఇటలీలో 19 శతాబ్దం తర్వాత మొదటిసారిగా జననాల సంఖ్య 400,000 కంటే తక్కువకు పడిపోయింది. దీంతో చాలా దేశాలు పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. జననాల రేటును పెంచాలని ఇటీల దేశస్థులకు పోప్​ఫ్రాన్సిస్​ పదే పదే సూచిస్తున్నారు.   మరో వైపు చైనాను అధిగమించి భారత్‌‌‌‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నిరుడు ఇండియా జనాభా 142.86 కోట్లకు పెరిగింది. చైనా జనామాభా మాత్రం 140 కోట్లకే పరిమితమైంది.