నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గృహలక్ష్మి నిబంధనలను సడలించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రానికి బస్సుయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుయాత్ర ముగిసే లోపు ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన చేయకపోతే, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ, శిఖం, దేవాదాయ భూముల్లో ప్రజలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సచివాలయం నిర్మించడానికి వెచ్చించిన ధనంతో వేలాది మందికి డబుల్ ఇండ్లు నిర్మించి ఇవ్వవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, జంగా రెడ్డి, కైలాస్ బాబు, వెంకట్రాములు, ఆశన్న, రమేశ్, వెంకట్, పర్వతాలు, శ్రీనివాస్, నరసింహ
పాల్గొన్నారు.