న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం మార్చింది. ఇకపై దానిని ‘శ్రీ విజయపురం’గా పిలవాలని నిర్ణయించింది. బ్రిటిష్ వలసపాలన ఆనవాళ్లను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
‘‘వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చాం. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో విజయానికి గుర్తు. నాటి పోరాటంలో అండమాన్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆశయాలకు కీలక కేంద్రంగా ఉంది. మన జాతీయ పతాకాన్ని మొదటిసారిగా నేతాజీ ఇక్కడే ఎగురవేశారు. సావర్కర్తో పాటు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన జైలు కూడా ఇక్కడే ఉంది” అని అమిత్ షా పేర్కొన్నారు.