రాజకీయాలకు గుడ్ బై.. పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

రాజకీయాలకు గుడ్ బై.. పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2024, నవంబర్ 21 గురువారం హైదరాబాద్‎లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు పోసాని అనౌన్స్ చేశారు. నా కుటుంబం, పిల్లల కోసమే రాజకీయాలు వదిలేస్తున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడనని.. ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ఇక నుండి ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనని పేర్కొన్నారు. నన్ను ఎవరూ ఏమనలేదు.. బెదిరించలేదు.. నా ఫ్యామిలీ కోసమే ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదన్న పోసాని.. ఇన్నాళ్లు ఒక ఓటర్‌ లాగే రాజకీయ పార్టీలను, నేతలను ప్రశ్నించానని.. మంచి చేసే వాళ్లకి సపోర్ట్‌ చేశానని.. అంతేకానీ తనకు ఎవరిపై కోపం లేదన్నారు.  కాగా, ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపై పోసాని విరుచుకుపడేవారు. 

మరీ ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్‎పై విమర్శలు వర్షం కురిపించేవారు. అయితే, ఏపీలో ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలుకాగా.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి పవర్‎లోకి వచ్చాక.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‎పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోసాని కృష్ణమురళిపై పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.