
- ఓట్లు చీలుతాయా? వన్ సైడ్ పడుతాయా?
- ఆదివాసీ లీడర్లకే మూడు పార్టీల టికెట్లు
- 2019 ఎన్నికల్లో వన్ సైడ్ గా ఓటర్లు
ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం ఈసారి హాట్ టాపిక్ గా మారింది. మూడు ప్రధాన పార్టీల (కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్) నుంచి ఆదివాసీ అభ్యర్థులే బరిలో ఉండటంతో.. ఆ సామాజిక వర్గం ఓటర్లు ఈసారి ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. ఓట్లు చీలుతాయా? లేదంటే వన్ సైడ్ పడుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల్లో ఆదివాసీ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో ఉద్యమ నేతగా ఉన్న సోయం బాపురావుకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆదివాసీ ఉద్యమాల్లో కీలక నేతగా బాపురావు వ్యవహరించడం, మోదీ మేనియాతో దాదాపు మెజార్టీ ఓట్లన్నీ బీజేపీకి మళ్లాయి.
దీంతో మొదటిసారి ఆదిలాబాద్ లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఈ గెలుపు ఆదివాసీలకూ కొండంత అండను ఇచ్చినట్లైంది.అయితే ఆదివాసీల ఉద్యమంలో కీలక డిమాండ్‌గా ఉన్నటువంటి ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలనేది మాత్రం నెరవేరలేదు. ఏజెన్సీల్లో సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఈసారి ఆదివాసీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఇన్ట్రెస్టింగ్గా మారింది. పార్టీలకు మద్దతు ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఐదేళ్లు తిరిగే సరికి జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. ఆదివాసీ సంఘాలు గ్రూపులుగా విడిపోయాయి. దీంతో పార్టీలకు మద్దతు ఇచ్చే అంశంపై ఆదివాసీలు ఏకతాటిపైకి వస్తారా? లేదా? అనేది డౌటే.
దాదాపు 3 లక్షల ఆదివాసీ ఓటర్లు
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు16.44 లక్షల ఓట్లు ఉండగా.. అందులో సుమారు 3 లక్షల వరకు ఆదివాసీ ఓటర్లే. ఈ క్రమంలో అభ్యర్థుల గెలుపోటములపై వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడున్న ముగ్గురు అభ్యర్థులు ఆదివాసీలే అయినప్పటికీ.. పార్టీ, అభ్యర్థి వ్యక్తిగతంగా చేసిన ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యుదయ భావజాలం, ఆదివాసీల ఉద్యమానికి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ముందు నుంచి అంతర్గతంగా మద్దతు ఇచ్చారనేది ప్రచారం.
కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే అంశం దృష్టిలో ఉంచుకొని ఆమెకు టికెట్ కేటాయించింది. బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ ఆదివాసీల మద్దతు కోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో గంపగుత్తగా ఆదివాసీలు బీజేపీ వైపు మొగ్గుచూపినప్పటికీ మారిన పరిస్థితులతో ఇప్పుడు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నగేశ్ఆదివాసీ ఉద్యమ సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ లో ఉండటంతో పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదని ఆదివాసీలు చర్చించుకుంటున్నారు.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఆదివాసీలు సైతం ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మూడు పార్టీలకు కూడా ఈసారి ఆదివాసీలు వన్ సైడ్ గా ఓట్లు వేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఆదిలాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి సీతక్క ఆదివాసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూడు నెలలుగా ఏజెన్సీ గ్రామాల్లో తిరుగుతూ ఆదివాసీల సమస్యలను తెలుసుకుంటున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడూతూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. సీతక్క ప్రభావంతో ఆదివాసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పోటీకి సిద్ధమవుతున్న లంబాడీలు
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 1.40 లక్షల వరకు తమ సామాజికవర్గం ఓటర్లు ఉంటారని లంబాడీల నేతలు చెబుతున్నారు. ఈసారి ఏ ఒక్క పార్టీ కూడా తమ సామాజికవర్గానికి టికెట్ కేటాయించకపోవడంతో లంబాడీ సామాజిక వర్గం మొత్తం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆ నేతలంతా ఏకమై పార్టీలకు అతీతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ వర్గం నుంచి ఎవరినైనా ఒక్కరిని పోటీలో దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల్లో లంబాడీ వర్గం నుంచి బలమైన నేతలు ఉన్నారు. వీరంతా ఎంపీ టికెట్ కోసం ఆయా పార్టీల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ఇప్పుడు ఎన్నికల్లో లంబాడీ నేతలు పోటీలో ఉంటే ఆదివాసీ అభ్యర్థుల గెలుపోటములు మారిపోయే అవకాశం ఉంది.